‘స్మార్ట్‌ఫోన్’లో రైళ్ల సమాచారం

3 Dec, 2014 06:42 IST|Sakshi
‘స్మార్ట్‌ఫోన్’లో రైళ్ల సమాచారం

సాక్షి, హైదరాబాద్: రైళ్ల రాకపోకల సమయాలను స్మార్ట్‌ఫోన్ ద్వారా తెలుసుకునే ప్రాజెక్టును దక్షిణ మధ్య రైల్వే మరింత విస్తరించింది. మొబైల్ అప్లికేషన్ (యాప్)తో రైళ్ల వేళలను తెలుసుకునే పద్ధతిని దక్షిణ మధ్య రైల్వే ఫిబ్రవరిలో ప్రారంభించింది. తాజాగా ఈ యాప్‌లో మరిన్ని స్టేషన్‌లకు సంబంధించిన రైళ్ల సమాచారంతో పాటు ఆయా స్టేషన్‌లలో ఉన్న వసతుల వివరాలనూ జోడించింది. తొలుత ఈ యాప్‌ను హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎన్‌క్వైరీ సిస్టం (హైలెట్స్) పేరుతో ఎంఎంటీఎస్ రైళ్ల సమాచారం తె లిపేందుకు ప్రారంభించింది. తర్వాత ట్రైన్ అరైవల్ డిపార్చర్ అండ్ ఎమినిటీస్ ఎట్ స్టేషన్స్ (తథాస్త్) పేరుతో విస్తరించింది.
 
  ప్రస్తుతం ఈ యాప్‌లో రెండు రాష్ట్రాల్లోని 25 ప్రధాన స్టేషన్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌ఓ సాంబశివరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైళ్ల రాకపోకల వేళల తాజా సమాచారం, స్టేషన్లలో ఉన్న వసతులు, స్టేషన్ లేఅవుట్ చిత్రాలు ఇకపై స్మార్ట్‌ఫోన్‌లో చూసుకోవచ్చన్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, ఒంగోలు, అనకాపల్లి, భువనగిరి, భీమవరం, గుంతకల్, చిత్తూరు, కడప, ఖమ్మం, మంచిర్యాల, నాందేడ్, రామగుండం, తెనాలి, తాడేపల్లిగూడెం, వికారాబాద్, తాండూరు, సిర్పూర్-కాగజ్‌నగర్, సేడం స్టేషన్‌ల వివరాలను కొత్త యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. గూగుల్ ప్లే స్టోర్ (ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్), ఆపిల్ యాప్ స్టోర్ (ఐఓఎస్ ఆధారిత స్మోర్ట్‌ఫోన్స్) ద్వారా ఈ యాప్‌ను ఉచితంగా స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

>
మరిన్ని వార్తలు