వెలికితీతే.. శాపమైంది !

26 Aug, 2019 02:16 IST|Sakshi

ఫణిగిరి తవ్వకాల్లో వెలుగుచూసిన అరుదైన సున్నం విగ్రహం

ప్రస్తుతం గాలిలో తేమ పీల్చుకుని శిథిలమవుతున్న వైనం

సంరక్షణ చర్యలు లేకపోవటంతో పొడిగా మారుతోంది

సాక్షి, హైదరాబాద్‌ : దేశంలోనే అత్యంత అరుదైన గార (డంగుసున్నంతో రూపొందిన) శిల్పం ఇప్పుడు వాతావరణ ప్రభావానికి గురై ముక్కలు ముక్కలుగా విడిపోయి శిథిలమవుతోంది... వందల ఏళ్లుగా భూగర్భంలో సురక్షితంగా ఉన్న ఆ ప్రతిమ, తవ్వకాల్లో వెలుగు చూశాక ఇప్పుడు రూపు కోల్పోతోంది. దాదాపు 6 అడుగుల పొడ వున్న ఈ బోధిసత్వుడి విగ్రహం ఇక్ష్వాకుల కాలంలో క్రీ.శ. మూడో శతాబ్దంలో రూపొందినట్టుగా పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఉన్న విఖ్యాత బౌద్ధస్థూప కేంద్రమైన ఫణిగిరిలో గత ఏప్రిల్‌లో ఇది బయటపడింది.

అప్పటికే పగుళ్లు ఏర్పడి కొంతభాగం ముక్కలైన ఈ శిల్పాన్ని తవ్వకాల సమయంలో అధికారులు సురక్షితంగా వెలికి తీసి నగరంలో ఉన్న పురావస్తుశాఖ డైరెక్టరేట్‌కు తరలించారు. ఇది డంగు సున్నంతో రూపొందిన విగ్రహం కావటం, తయారై దాదాపు 1700 సంవత్సరాలు కావస్తుండటంతో దానికి వెంటనే సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం వానాకాలం కావటంతో గాలిలో అధికంగా ఉండే తేమను పీల్చుకుని అది వేగంగా శిథిలమవుతోంది. మరికొంతకాలం ఇలాగే ఉంటే అది ముక్కలుముక్కలై అనవాళ్లు కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. ఈలోపే దాన్ని సంరక్షించి తేమ చొరబడకుండా గాజు పెట్టెలో భద్రపరచాల్సి ఉంది. 

నిపుణులు సిద్ధంగా ఉన్నా...
దాదాపు 1700 ఏళ్లక్రితం ఆ విగ్రహం రూపొందిందని స్థల చరిత్ర ఆధారంగా అధికారులు అప్పట్లో గుర్తించారు. ఫణిగిరి బౌద్ధక్షేత్రం కావటంతో ఈ ప్రతిమ కూడా బుద్ధుడిదే అయి ఉంటుందని భావించారు. కానీ విగ్రహంపైన ఆభరణాల గుర్తులున్నాయి. దీంతో అది ఓ రాజుదిగా తేల్చారు. బుద్ధుడి జాతక కథల్లో ఉండే బోధిసత్వుడుదిగా తేల్చారు. గతంలో బోధిసత్వుడికి సంబంధించి రెండు మూడు అడుగుల ఎత్తున్న గార ప్రతిమలు వెలుగు చూశాయి. కానీ 6 అడుగులకంటే ఎత్తున్న సున్నం విగ్రహం ఇప్పటివరకు ఎక్కడా బయటపడలేదు. విగ్రహంపై అలంకరణకు సంబంధించి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయి, ఒక చేయి, కొంతభాగం కాళ్లు ఉన్నాయి. ఆ ఆకృతి ఆధారంగా విగ్రహానికి పూర్తి రూపు ఇవ్వగలిగే నిపుణులు ఢిల్లీ, ముంబై, పుణేల్లో ఉన్నారు.

కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలో కూడా ఇలాంటి నిపుణులున్నారు. వారిని పిలిపిస్తే విగ్రహంపై ప్రస్తుతానికి మిగిలిన ఆనవాళ్ల ఆధారంగా అదే డంగు సున్నం మిశ్రమంతో దాని పూర్వపు రూపాన్ని సృష్టిస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పద్ధతిలో దాన్ని గాలి చొరబడని గాజు పెట్టెలో భద్రపరిస్తే భావితరాలకు అందించే వీలుంటుంది. కానీ ఆ కసరత్తు లేకుండా పురావస్తుశాఖ విగ్రహాన్ని గాలికొదిలేసింది. ఇలా నెలల తరబడి నిర్లక్ష్యం కారణంగా సున్నపు విగ్రహం తేమను పీల్చుకుంటూ శిథిలమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి అరుదైన విగ్రహా లు ధ్వంసమైతే భావితరాలకు చరిత్ర తెలియకుండా పోతుందని అంటున్నారు.  

మరిన్ని వార్తలు