ఫణిగిరి శిల్పాలు.. పట్టించుకోరేమి?

20 Jan, 2018 01:22 IST|Sakshi

అద్భుత శిల్పరాజాలు దుమ్ముకొట్టుకుపోవాలా?

మన శిల్పాలే ఇలా ఉంటే ‘లండన్‌’ను ఏమడుగుతాం?

అంతర్జాతీయ సదస్సులో ఓ పరిశోధకుడి ప్రశ్న

‘‘ప్రపంచాన్నే మెప్పించే అద్భుత శిల్పాలను మనం గౌరవించుకోలేకపోతున్నప్పుడు లండన్‌ మ్యూజియంలో విరాజిల్లుతున్న అమరావతి శిల్పాలను వెనక్కు ఇవ్వమని ఎలా అడగగలం?’’
..ఓ పరిశోధకుడు సంధించిన ప్రశ్న ఇది! దీనికి ప్రభుత్వం, అధికారుల వద్ద సమాధానం ఉందా? ఫణిగిరిలో ఓ చీకటి గదిలో దుమ్ముకొట్టుకుపోతున్న ఫణిగిరి బౌద్ధారామం శిల్పరాజాలను చూస్తే లేదనే సమాధానం వస్తుంది.  – సాక్షి, హైదరాబాద్‌


ఇది బుద్ధుడి జీవితంలో అత్యంత ముఖ్య ఘట్టాలను సూక్ష్మంగా విశదీకరించిన అద్భుత శిల్పం. ప్రస్తుతం అంతర్జాతీయ ప్రదర్శనలో భాగంగా ముంబయిలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. త్వరలో ఇది లండన్‌ మ్యూజియంలోనూ ఠీవీగా నిలవబోతోంది. ఈ శిల్పం సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో జరిగిన తవ్వకాల్లో వెలుగుచూసింది. అప్పట్లో దీంతోపాటు ఇంతకంటే ఘనమైన మరెన్నో శిల్పరాజాలు బయల్పడ్డాయి.

కానీ ప్రసుతం అవన్నీ ఫణిగిరిలో ఓ చీకటి గదిలో దుమ్ము కొట్టుకుపోతున్నాయి. ఇదే విష యమై శుక్రవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో ప్రారంభమైన రెండ్రోజుల అంతర్జాతీయ పురావస్తు సదస్సులో నమన్‌ పి.అహూజా అనే పరిశోధకుడు ఆలోచింపచేసే చర్చకు తెరతీశారు. ‘కిరీటంలో కలికితురాయి–ఫణిగిరి’పేరుతో పరిశోధన పత్రాన్ని సమర్పించిన ఆయన.. ఫణిగిరి శిల్పాల గొప్పదనాన్ని వివరించారు.

బుద్ధుడిగా మారిన యువరాజు.. తలపై ఉన్న పగిడీ తొలగించి, కరవాలంతో స్వయంగా జుత్తు కోసేసి జ్ఞానబోధకు బయ ల్దేరిన తీరును కళ్లకు గట్టిన ఆ శిల్పాలు గొప్ప మ్యూజియంలో ఉండాలని ఆకాంక్షించారు. అంతెత్తు గుట్టపై బౌద్ధ స్తూపం ఉన్న తీరు స్థానికంగా మరెక్కడా కనిపించదన్నారు. ఒకదాన్ని మించింది మరొకటిగా ఉన్న శిల్పాలు ప్రదర్శనకు నోచుకోనప్పుడు లండన్‌ మ్యూజియంలో అమరావతి బౌద్ధ శిల్పాలు చిక్కుకుపోయాయని బాధపడటంలో అర్థమే లేదన్నారు.

ఈ సదస్సులో డాక్టర్‌ పరుల్‌ పాండ్యధర్, డాక్టర్‌ కావూరి శ్రీనివాస్, ప్రొఫె సర్‌ ఆర్‌.లక్ష్మీరెడ్డి, ఎస్‌.ఉదయ్‌భాను తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు పునర్‌ముద్రణ ‘కాకతీయ డైనాస్టీ’ పుస్తకం సహా రెంటినీ ఆవిష్కరించారు. నర్మెట్ట, పాల్మాకుల తవ్వకాల్లో బయల్పడిన వస్తువులు, నాణేలు, శాసనాల ప్రతుల ప్రదర్శన ఆకట్టుకుంది.

న్యూయార్క్‌ ప్రొఫెసర్‌ ఆసక్తి
అమెరికాలోని న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌ ప్రొఫెసర్‌ జాన్‌ గై చూపిన ఆసక్తి సదస్సులో పలువురిని ఆకట్టుకుంది. బౌద్ధంపై పరిశోధనలో భాగంగా ఆయన సూర్యాపేట జిల్లా ఫణిగిరి గురించి తెలుసుకున్నారు.  మూడేళ్ల క్రితం ఫణిగిరి వచ్చి అక్కడి బౌద్ధ స్తూపాన్ని పరిశీలించారు.

అక్కడి తవ్వకాల్లో బయల్పడిన∙శిల్ప సంపద చూసి ఆశ్చర్యపోయారు. ఇతర బౌద్ధ దేశా ల్లోని శిల్పాలతో వీటిని పోలుస్తూ పరిశోధన జరిపారు. ఆ పరిశోధన పత్రాన్ని శుక్రవారం సమర్పించారు. ‘‘ఫణిగిరి అద్భుత బౌద్ధ కేంద్రం. మూడేళ్ల క్రితం దాన్ని చూసి తరించా. అక్కడి శిల్పాలను చూస్తే ఆశ్చర్యమనిపిస్తుంది’’ అని ఆయన ‘సాక్షి’తో అన్నారు.

మరిన్ని వార్తలు