రామప్పలో కచ్చడాల దురాచారం?

7 May, 2018 12:34 IST|Sakshi
రామప్ప గోడలపై చెక్కిన శిల్పాలు

కోటగుళ్లు, రామప్పలో వెలుగు చూసిన శిల్పాలు

కచ్చడాల తరహాలో చెక్కిన   స్త్రీల బొమ్మలు

కాకతీయుల కాలంలో   కచ్చడాల సంస్కృతిపై  అనుమానాలు

మరెక్కడా లభించని  ఈ దురాచారపు ఆధారాలు

గత చరిత్రపై సరికొత్త చర్చకు తెర లేపుతున్న శిల్పాలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : సాంఘిక దురాచారాల్లో ఒకటిగా పరిగణించే ఇనుప కచ్చడాల దురాచారం కాకతీయుల కాలంలో అమలులో ఉందా? అంతః పుర కాంతల శీలం కాపాడేందుకు ఈ దుర్మార్గపు సంప్రదాయాన్ని వారేమైనా అమలు చేశారా?  లేదా అమానవీయమైన ఈసంస్కృతి కాకతీ యు ల కాలంలోనే అంతరించిపోయిందా ? అంటే.. అవుననే చర్చకు తెరతీస్తున్నాయి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని గణపేశ్వరాలయంతోపాటు రామప్ప ఆలయంపై ఉన్న స్త్రీల శిల్పాలు.

కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు కావడంతో నాటి పరిస్థితికి ఇవి అద్దం పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాకతీయుల కాలంలో శిల్పకళ ఉన్నత స్థితిలో వర్ధిల్లింది. రామప్ప ఆలయమే  ఇందుకు ఉదాహరణ. కాకతీయుల కాలంలో అనేక ఆలయాలను నిర్మించారు. వీటిలో రామ ప్ప, గణపురం కోటగుళ్లు ప్రముఖమైనవి. గణపు రం కోటగుళ్లలోని ప్రధాన ఆలయంలో శివుడు ఆరాధ్య దైవం.

ఇక్కడ మొత్తం 22 ఆలయాలు  ఉన్నాయి. వీటి చుట్టూ మట్టి కోట నిర్మాణం ఉంది. కాకతీయుల కాలంలో గణపురం కోటగుళ్లు ఉన్న ప్రదేశం గొప్ప సైనిక స్థావరంగా ఉండేది. ప్రస్తుతం ఆ ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పటికీ నిత్యం  పూజలు జరుగుతున్నాయి. పునరుద్ధరణ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆలయంలో ప్రధాన  ఆలయం ఎడమ వైపు ఉన్న గోడపై వివిధ శిలాకృతులు ఉన్నాయి. ఇందులో రెండు స్త్రీ శిల్పాలు లోహ కచ్చడాలను ధరించినట్లుగా చెక్కారు. అలాగే రామప్ప ఆలయంపైన కూడా ఇలాంటి శిల్పాలే ఉన్నాయి. 

తేల్చాల్సిన విషయమే.. 

గణపేశ్వరాలయం ప్రధాన ఆలయం ఎడమవైపు గోడతోపాటు మట్టికోటలోనే హరిత హోటల్‌ వద్ద  భద్రపరచిన శిల్పాల్లో మరొకటి ఇదే తరహాలో ఉంది. ఈ శిల్పం ఉన్న తీరులో ఎలాంటి లైంగిక భంగిమలకు ఆస్కారం లేదు. అంతేగాక శృంగారోద్దీపన లేదు. మిగతా శరీర వస్త్రాలను చూపించడం లేదు. కేవలం అంతవస్త్రంలాంటిది తొలగిస్తున్న మహిళగా ఈ శిల్పం ఉంది. ఈ వస్త్రాన్ని చెక్కిన తీరు  అచ్చం ఇనుప కచ్చడాలను పోలి ఉండడంతో సరికొత్త చర్చ మొదలైంది. 

పూర్వ కాలంలో అంతఃపురం స్త్రీల విషయంలో ఇనుప కచ్చడాలను అమలు చేసే దురాచారం అమలులో  ఉండేది. ఆ దిశగా శిల్పాన్ని పరిశీలించగా వివిధ దేశాల్లో, వివిధ కాలాల్లో ఉన్న ఇనుప కచ్చడాలకు ఈ  శిల్పానికి సారుప్యతలు ఉన్నా యి. దీంతో ఇది ఇనుప కచ్చడమేనా అనే దిశగా చర్చ మొదలైంది. అయితే కాకతీయుల కాలంలో ఇనుప కచ్చడాల సంస్కృతి అమల్లో ఉన్నట్లుగా నాటి కావ్యాల్లోగానీ మరెక్కడా ఆధారాలు లభించలేదు.

ఇప్పటి వరకు లభించిన శాసనాలు, ఆలయాల్లో ఈ తరహా శిల్పాలు లేవు. దీంతో ఈ విషయంపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఏర్పడింది. మరోవైపు ఈ శిల్పానికి కాలక్రమంలో మార్పులు చేసినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు లభిం చడం లేదు. అందువల్ల గణపురంలో, రామప్ప ఆలయంలో వెలుగు చూసిన స్త్రీ శిల్పాల్లో ధరించింది అంగవస్త్రమా లేక ఇనుప కచ్చడమా తేలాల్సి ఉంది. 

మరిన్ని ఆధారాలు కావాలి :కట్టా శ్రీనివాస్, చరిత్ర పరిశోధకుడు

గణపేశ్వరాలయం నిర్మాణ సమయంలో ఇనుప కచ్చడాల దురాచారం అమలులో ఉందా లేదా అనేది తెలియదు. ఒక వేళ ఉంటే ఆ సమయంలో ఎలాంటి ఉద్యమం నడిచిందో, ఎలాంటి విప్లవా త్మక రాజాజ్ఞ పనిచేసిందో తెలియదు. ఆడామగా సమానమనే కనీస స్పృహ లేకుండా ఆడవాళ్లను కేవలం వస్తువులుగా, పెంపుడు జంతువులుగా లేదా అంతకంటే హీనంగా పరిగణించే ఈ సంస్కృతిని తప్పుబడుతూ వీటిని ఉపయోగించడం నిషిద్ధంలాంటి ఆజ్ఞ వచ్చి ఉంటే ఆ చారి త్రాత్మక పరిణామాన్ని సూచించేందుకు ఈ శిల్పం చెక్కారేమో అని భావించేందుకు ఆస్కారం ఉంది.

కాకతీయులకు సంబంధించి మరెక్కడ ఇలాంటి శిల్పాలు లేవు. కాబట్టి ఈ అంశంపై మనకు లభించిన ఆధారాలను క్రమంలో పేర్చుకుంటూ ఇలా అయి ఉండవచ్చు అనేది హైపో థిసీస్‌ అవుతుంది. ఇది నిజమా లేక అబద్ధమా అని నిర్ధారించేందుకు పటిష్టమైన ఆధారాలు లభించాలి.  దురాచారం వచ్చిందిలా .. పూర్వకాలంలో తమ సంపదను దాచుకునే అనేక పద్ధతుల్లోనే అంతఃపుర కాంతల శీలం కాపాడటం లేదా కేవలం తమ అదుపాజ్ఞల్లో ఉంచడం అనే ఆలోచనలతో ఇనుప కచ్చడాలు అనే దురాచారం రాజులు అమలు చేసేవారు.

వీటికి సంబంధించి ఓరగచ్చ, కక్షాపటం, కచ్చ, కచ్చ(డ)(ర)ము, కచ్చటిక, కచ్చము, కౌపీనము, ఖండితము, గుహ్యాంబరము, గో(ణ)(ణా)ము, గోవణము, చీరము, తడుపు పుట్టగోచి, పొట్టము, పొటముంజి, బాలో పవీతం, బొట్టము, లంగోటి ఈ పేర్లన్నీ కూడా లోదుస్తులు అనే దానికి పర్యాయపదాలు. లోహలతో తాళం తీసి వేసేందుకు వీలుగా లో దుస్తులను రూపొందించారు. వీటిని ఇనుముతో చేస్తే ఇనుప కచ్చడాలు అని అని లోహంతో అయితే లోహకచ్చడాలు అని అనడం పరిపాటి.

ఈ అంశంపై ప్రముఖ రచయిత తాపీ ధర్మారావు ఇనుప కచ్చడాలు పేరుతో పుస్తకం రాశారు. కాలకృత్యాలకు అడ్డురాకుండా ఉంటూ లైంగిక కార్యకలాపం జరపడానికి వీలులేకుండా ఇనుము లేదా లోహంతో తయారు చేసిన కచ్చడాలను స్త్రీలు తమ మొల చుట్టూ ధరించడం ఈ దురాచారంలో భాగం. ఇవి శరీరానికి ఒరుసుకు పోకుండా లోపటి వైపు తోలు గుడ్డ వంటి మెత్తలను ఉంచేవారు. బహుశా కాలక్రమంలో ఈ సంస్కృతే సిగ్గుబిల్ల, మరుగు బిళ్లలుకు దారితీశాయనే వాదనలు ఉన్నాయి.

సంస్కృతంలో పిప్పలదనము అని, ఆంగ్లంలో ఫిగ్‌ లీఫ్‌గా పేర్కొన్నారు. జపాన్‌లోనూ ఇలాంటి సంస్కృతి ఉన్నట్లు ఆధారాలున్నాయి. రావి ఆకు ఆకారంలో ఉండే ఈ కచ్చడాలకు నడుముపై వడ్డాణంతో బంధించేవారు. వీటికి తాళాల ను బిగించేవారు. ఎవరుగాని, ఎలాంటి మారుతాళంతోగాని వీటిని తెరవడానికి వీలులేకుండా ఉండే విధంగా కొత్త తాళాలు తయారుచేసేవారు. కాలక్రమంలో అమానవీయ దురాచారం కనుమరుగైంది.  

మరిన్ని వార్తలు