సెర్చ్‌ కమిటీ సైలెంట్‌.. !

19 Oct, 2019 11:01 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : రెగ్యులర్‌ వీసీ నియామకానికి ఏర్పాటు చేసిన సెర్చ్‌ కమిటీ సైలెంట్‌ అయిందా..? అనే ప్రశ్నకు శాతవాహన యూనివర్సిటీ వ్యాప్తంగా అవుననే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం రాష్ట్రంలో గల వివిధ యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగియడంతో అన్ని యూనివర్సిటీలకు ఐఏఎస్‌ అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించారు. శాతవాహనకు మాత్రం గతంలోనే ఐఏఎస్‌ అధికారి ఇన్‌చార్జి వీసీగా ఉండడంతో తిరిగి ఆయననే కొనసాగించారు.

శాతవాహన యూనివర్సిటీకి వీసీని ఎంపిక చేసేందుకు ప్రభుత్వం గత నెలలో ముగ్గురితో కూడిన సెర్చ్‌ కమిటీని వేశారు. ఈ కమిటీ వీసీ పోస్టుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అందులో ముగ్గురిని ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంటుంది. ఈ సెర్చ్‌ కమిటీ ఏర్పాటు చేసి నెల రోజులు కావస్తున్నా నేటికి వీసీ నియామక ప్రక్రియ ముందుకు సాగడం లేదని  విద్యావేత్తల నుంచి  విమర్శలు ఎదురవుతున్నాయి. 

ఇన్‌చార్జి పాలన నుంచి విముక్తి ఎన్నడో..?
యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఐదుగురు వీసీలుగా పని చేయగా వీరిలో ఇద్దరు పూర్తిస్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ఆరేళ్ల పాటు వీరి పాలన కొనసాగింది. తర్వాత నాలుగేళ్లపాటు ముగ్గురు ఇన్‌చార్జి వీసీలతోనే నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం వీసీగా ఉన్న హెచ్‌ఎండీఏ కమిషనర్‌ టి.చిరంజీవులును 30 ఆగస్టు 30, 2017న ప్రభుత్వం నియమించింది. ఆయన అప్పుడప్పుడు వచ్చి వెళ్లినా, కీలక నిర్ణయాలు, సాధారణ పనులకు యూనివర్సిటీ అధికారులు హైద్రాబాద్‌కు పరుగులు తీయాల్సి వస్తోంది. అలాగే అక్కడ ఆయన సమయం కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. దీంతో శాతవాహనకు కొత్త వీసీని నియమించాలనే నిర్ణయానికి వచ్చి దరఖాస్తులు ఆహ్వానించారు. కాని సెర్చ్‌ కమిటీ వేశాక కూడా ప్రక్రియ ఎందుకు ముందుకు సాగడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. 

నియామక ప్రక్రియలో జాప్యం 
వీసీ నియామక ప్రక్రియలో సెర్చ్‌ కమిటీ నియామకం కీలకం. శాతవాహన యూనివర్సిటీకి గత నెల 20 తేదిన ప్రభుత్వం సెర్చ్‌ కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. ఇందులో శాతవాహన ఈసీ నామినీగా మాజీ  జెఎన్‌టీయూ హైద్రాబాద్‌కు వీసీ ప్రొఫెసర్‌ రామేశ్వర్‌రావును, యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నామినీగా యూజీసీ మెంబర్, భగత్‌పూల్‌సింగ్‌ మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ సుష్మయాదవ్, రాష్ట్ర ప్రభుత్వ నామినీగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ ఛీఫ్‌ సెక్రెటరీ ఐఏఎస్‌ అధికారి సోమేష్‌కుమార్‌ను నియమించారు. .

ఇన్ని రోజులు గడిచినా ఈ ప్రక్రియలో జాప్యంపై విద్యార్థులు అసంతృప్తితో ఉన్నారు. వీసీని నియమిస్తేనే ఖాళీగా ఉన్న పోస్టులు నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులు సైతం ఆశపడుతున్నారు. ప్రభుత్వం తొందరగా వీసీని నియమించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు