సాగుకు ముందే పంట రుణం

8 Feb, 2017 03:15 IST|Sakshi

స్థానిక అవసరాలకు అనుగుణంగా పంటల బీమా
సాక్షి, హైదరాబాద్‌: సీజన్‌లో సాగుకు ముందే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ‘ఐదేళ్లలో రైతు ఆదాయం రెట్టింపు’ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సూచించింది. అప్పుడే రైతు తనకు అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనుగోలుచేసి ప్రైవేటు అప్పులకు దూరంగా ఉంటారని, రెట్టింపు ఆదాయానికి మార్గం సుగమం అవుతుందని స్పష్టం చేసింది. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖ కమిషనర్‌ జగన్‌మోహన్‌ చైర్మన్‌గా, ప్రొఫెసర్‌ రాజిరెడ్డి కన్వీనర్‌గా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ సమావేశం మంగళవారం జరిగింది.

ఇందులో నాబార్డు సహా వ్యవసాయ, ఉద్యాన, పశుసం వర్థక, మార్కెటింగ్‌ తదితర అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రైతు ఆదాయం రెట్టింపునకు వ్యవసాయ, ఉద్యాన, పశు సంవర్థక శాఖలు తమ నివేదికలు అందజేశాయి. ప్రస్తుతం సాగు చేశాకే పంట రుణాలు ఇస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ వివరించింది. పంట వేయడానికి ముందే వివిధ పంటలకు బీమా ప్రీమియం గడువులను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ధారించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంగా పాడి, చేపలు, గొర్రెల పెంపకం వంటి వాటిని కూడా ఎంచుకోవాలని సూచించారు.

ఎరువుల వాడకాన్ని తగ్గించాలి: వచ్చే ఖరీఫ్‌ నుంచి ఎరువుల వాడకాన్ని కనీసం పావు శాతానికి తగ్గించేలా చూడాలని కమిటీ సూచించింది. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న అంశంపై వ్యవసాయశాఖ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించింది. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు రెండు బృందాలు వెళ్లి సర్వే నిర్వహించాయి.

మరిన్ని వార్తలు