సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

11 Jun, 2016 02:34 IST|Sakshi
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఖానాపూర్ : వర్షాకాలం సీజన్ ప్రారంభం అయినందున ఆరోగ్యశ్రీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి అల్హం రవి అన్నారు. శుక్రవారం ఖానాపూర్‌లోని సీహెచ్‌ఎన్‌సీ క్లస్టర్ కార్యాలయంలో పెంబి, కడెం, దస్తురాబాద్, మామడ పీహెచ్‌సీల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులు, జ్వరాల గురించి ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.  గత ఏడాది మలేరియా, డెంగ్యూ కేసులు ఈ ప్రాంతంలో అదికంగా నమోదయిన కారణంగా ముందే అప్రమత్తంగా ఉండాలన్నారు. హెల్త్ సూపర్‌వైజర్‌లు ఈసీజన్‌లో విధిగా గ్రామాల్లో పర్యటించాలన్నారు.

ఆరోగ్య సిబ్బంది, సమన్వయంతో టీం వర్క్‌చేసినపుడే వ్యాదులు ప్రబలకుండా పరిస్థితి అదుపులో ఉంటుందన్నారు.  మామడ, పెంబి పీహెచ్‌సీల్లో పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు.

ప్రధానంగా వర్షాకాలం సీజన్‌లో హెల్త్ సూపర్‌వైజర్‌లు పంచాయతీ అధికారులు, సిబ్బందితో సమన్వంగా ముందుకెళ్తూ పారిశుధ్య నిర్మూలనపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నిర్మల్ ఏరియా ఆసుపత్రిలో డెంగ్యూ, జ్వర పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది రక్తనమూనాలు సేకరించి  మలేరియా డెంగ్యూ పరీక్షలపై ప్రజలకు తెలియపరుచాలన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ సీఎం వేణుగోపాలకృష్ణ, కడెం పీహెచ్‌సీ వైద్యాదికారి మానస, సీహెచ్‌వో లింబాద్రి, పెంబి హెచ్‌ఈవో తుఫ్రాన్ వేణుగోపాల్, గాడ్పు రవి, గోపాల, సదయ్య, మహెందర్, బోజరెడ్డి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు