తగ్గని సీజనల్‌ జ్వరాలు

29 Oct, 2018 11:59 IST|Sakshi
భూపాలపల్లిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్న జ్వర పీడితులు భూపాలపల్లి పట్టణంలోని సుభాష్‌కాలనీలో పేరుకుపోయిన చెత్త

భూపాలపల్లి అర్బన్‌: జిల్లాను సీజనల్‌ జ్వ రాలు వదలడం లేదు. పల్లె, పట్నం అని తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నా యి. వానాకాలం ముగిసి నెలరోజులు గడుస్తున్నా తీవ్రత తగ్గుముఖం పట్టడం లేదు. టైఫాయిడ్, డెంగీ, మలేరియా, వైరల్‌ ఫీవర్లతో ప్రజలు ఆస్పత్రులపాలవుతున్నారు. టెస్టుల   పేరుతో బాధితుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యారోగ్య శాఖ అరకొర వైద్యంతో సరిపెడుతోంది. దీంతో మెరుగైన సేవలకోసం రోగులు పరకాల, హన్మకొండ, వరంగల్‌ లాంటి ప్రాంతాలకు పరుగుపెడుతున్నారు.

వణికిస్తున్న జ్వరాలు..
జిల్లా వ్యాప్తంగా నెల రోజుల క్రితం తగ్గినట్టు కనిపించిన జ్వరాలు మళ్లీ వణికిస్తున్నాయి. ముఖ్యంగా టైఫాయిడ్, వైరల్‌ జ్వరాల తీవ్రత అధికమైంది. దీనికితోడు వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పగలు విపరీతమైన ఎండవేడి.. రాత్రి సయంలో చలి పెరిగింది. దీంతో దగ్గు, జలుబులతో జనాలు గోసపడుతున్నారు. మరో వైపు డెంగీ జ్వరాలు కలవరపెడుతున్నాయి. శరీరం ఏమాత్రం వేడిగా అనిపించినా డెంగీ జ్వరమేమో అని అనుమానించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అపరిశుభ్రతే అసలు సమస్య
వర్షాకాలం పారిశుద్ధ సమస్య ఎక్కువగా ఉంటుంది. జ్వరాల తీవ్రత సైతం అధికంగా ఉంటుంది. జిల్లాలో వానలు తగ్గుముఖం పట్టి దాదాపు నెలరోజులు గడిచినా పారిశుద్ధ్య సమస్య అలాగే ఉంది. ఏ పల్లెను చూసినా మురికి గుంతలు, దోమలు, పేరుకుపోయిన చెత్తాచెదారం, పందుల బెడద కనిపిస్తోంది. పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారంభమైనప్పటి నుంచి పారిశుద్ధ్య సమస్య అధికమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వచ్చే జ్వరాలకు దోమలే కారణమని వైద్యులు చెబుతున్నారు. 

పరీక్షలకు తడిసిమోపెడు.. 
జిల్లాలోని ప్రజలు ఎక్కువ శాతం హన్మకొండ, వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రులనే ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏ జ్వరం వచ్చినా ముందుగా పలు రకాల పరీక్షలు చేయినిదే వైద్యులు మందులు రాసే పరిస్థితి లేదు. ఈ టెస్ట్‌ల ఖర్చే తడిసి మోపెడవుతోంది. జ్వరం రాగానే సీబీపీ, వైడల్, మలేరియా, డెంగీ తదితర పరీక్షలు చేయిస్తున్నారు. ఈ నాలుగు టెస్ట్‌లకు ల్యాబ్‌లలో సుమారు రూ.1200 నుంచి రూ.1500 వరకు ఖర్చవుతోంది. దీనికి పడకల చార్జీలు అదనం. ఆస్పత్రి స్థాయిని బట్టి రోజుకు రూ.400 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. డెంగీ అని తేలితే నిత్యం రక్తకణాల కౌంటింగ్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సిందే. ఇందుకు రోజులకు రూ.500 వరకు వెచ్చించాల్సి వస్తోంది.
 
నామామాత్రంగా వైద్య శిబిరాలు
జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాలు అధికంగా ఉండడంతో పల్లె ప్రజలు విషజ్వరాల బారిన  పడుతున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధ్వర్యంలో స్థానిక పీహెచ్‌సీల వైద్య బృందం గ్రామాల్లో శిబిరాలు నిర్వహించి ముందుస్తు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. నామమాత్రంగా నెలలో ఒకటి రెండు సార్లు క్యాంపులు నిర్వహిస్తున్నారు. జ్వర పీడితులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండా రెండు మాత్రలు ఇచ్చి సరిపెడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 

దోమల మందు పిచికారీ చేయిస్తాం..
జిల్లాలో విషజ్వరాలు ప్రభలుతున్న గ్రామాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని అన్ని మండలాల వైద్యాధికారులను ఆదేశించాం. గుర్తించిన గ్రామాల్లో మెడికల్‌ క్యాంప్‌లు సైతం నిర్వహిస్తున్నాం. మలేరియా విభాగం అధికారులతో దోమల నివారణకు మందు పిచికారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాను. సీజనల్‌ వ్యాధుల నివారణపై ఆశ వర్కర్లతో ప్రజలకు అవగహన కల్పిస్తాం. ప్రతి శుక్రవారం డ్రైండే పాటించేలా చర్యలు తీసుకుంటాం.  – డాక్టర్‌ సుదార్‌సింగ్, డీఎంహెచ్‌ఓ 

మరిన్ని వార్తలు