‘దోస్త్‌’తో ఎక్కడైనా సీటు

17 May, 2018 13:59 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ప్రొఫెసర్‌ పాపిరెడ్డి

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

నిజామాబాద్‌నాగారం : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం పొందేవారు ‘దోస్త్‌’ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఉన్నతవిద్యా మండలి ప్రొఫెసర్‌ పాపిరెడ్డి అన్నారు. బుధవారం ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంవత్స రం ఇంటర్‌లో 2లక్షల 80వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని, సప్లిమెంటరీలోనూ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో గతేడాది కంటే ఈ సంవత్సరం డిగ్రీ కళాశాలల్లో సీట్లు తగ్గినప్పటికీ.. విద్యార్థులకు సరిపడా 3లక్షల 90వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు వసతులను బట్టి విద్యార్థుల ప్రవేశాలు తీసుకోవాలన్నారు. కానీ కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలు ప్రవేశాలు తక్కువగా తీసుకుంటున్నారని, వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. చివరి సమయంలో విద్యార్థులను ప్రలోభ పెట్టి ప్రవేశాలు పొందుతున్నారని ఆరోపించారు. న్యాయంగా ప్రవేశాలు పొందకుండా, అడ్డదారిలో వెళితే దోస్త్‌నుంచి తొలగిస్తామన్నారు. తప్పుడు ప్రవేశాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీలకు లేఖలు రాస్తానన్నారు.

మొదటివారం నుంచే కళాశాలలు సక్రమంగా తరగతులు నిర్వహణ, విద్యార్థుల హాజరు, విద్యాబోధన తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తామన్నారు. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహించకపోతే శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా చదువుతున్న విద్యార్థులు తరగతులకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు.  

ఫోన్‌ ద్వారా ప్రవేశాలు.. 

విద్యార్థులు ఫోన్‌ ద్వారానే డిగ్రీలో ప్రవేశాలు పొందే అవకాశం ఉందని ఉన్నతవిద్యా మండలి వైస్‌చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి అన్నారు. విద్యార్థులు తమ ఫోన్‌నంబర్‌కు ఆధార్‌తో అనుసంధానం చేసుకుంటే ఉన్న చోట నుంచే ప్రవేశప్రక్రియ పూర్తి చేసుకోవచ్చన్నారు. మీసేవ కేంద్రాల్లో, ఇంటర్‌నెట్‌ల ద్వారా కూడా ఈ అవకాశం ఉందన్నారు. 74 హెల్ప్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ఆధార్‌కార్డు, ఇతర ధ్రువపత్రాలు లేకున్నా ఖైరదాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామన్నారు. ప్రవేశ ప్రక్రియ మూడు ఫేస్‌లో ఉంటుందని, ఒకసారి దరఖాస్తు చేసుకుంటే 1100 కళాశాలల్లో ఎక్కడైనా ప్రవేశాలు పొందవచ్చన్నారు.  

మరిన్ని వార్తలు