సీటు బెల్టు ప్రాణదాతే! 

30 Aug, 2018 02:56 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ద్విచక్ర వాహనానికి హెల్మెట్‌.. తేలికపాటి వాహనానికి సీటుబెల్టు.. నిబంధనల ప్రకారం కచ్చితం. ఎయిర్‌బ్యాగ్స్‌తో సంబంధం లేకుండా సీటుబెల్టు పెట్టుకోవాల్సిందే. ఇది అనేక సందర్భాల్లో ప్రాణదాతగా మారింది. ఏటా దేశంలో చోటు చేసుకుంటున్న తేలికపాటి వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో 60 శాతం మంది సీటుబెల్టు వాడని కారణంగానే మృత్యు వాతపడుతున్నారని పలు అధ్యయనాల్లో తేలింది.

ప్రాణాలు కాపాడిన సీటుబెల్టు 
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు ప్రతీక్‌రెడ్డి సహా నలుగురు ప్రయాణిస్తున్న కారు 2011 డిసెంబర్‌ 21న హైదరాబాద్‌ శివార్లలోని మెదక్‌ జిల్లా కొల్లూరు వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్‌పై ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారు గంటకు 150 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో ప్రతీక్‌తో పాటు సుజిత్‌కుమార్, చంద్రారెడ్డి ఘటనాస్థలిలోనే మరణించారు. వెనుక సీట్లో కూర్చున్న ఆరవ్‌రెడ్డి సీటు బెల్టు పెట్టుకోవడంతో మృత్యుంజయుడు అయ్యాడు. 2016 మే 17న ఏపీ మాజీ మంత్రి, ఏపీ ఆప్కాబ్‌ చైర్మన్‌ పిన్నమనేని వెంకటేశ్వర్‌రావు ప్రయాణిస్తున్న కారు ఓఆర్‌ఆర్‌ రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటనలో ఆయన భార్య సాహిత్యవాణి, డ్రైవర్‌ స్వామిదాసు  కన్నుమూశారు. సీటుబెల్టు పెట్టుకోవడంతో వెంకటేశ్వర్‌రావు ప్రాణాలతో బయటపడ్డారు. 

సీటుబెల్టు, ఎయిర్‌ బ్యాగ్స్‌కు లింక్‌.. 
అన్ని హైఎండ్‌ కార్లలో సీటు బెల్టుకు, ఎయిర్‌బ్యాగ్స్‌కు మధ్య లింకు ఉంటుంది. బెల్టు పెట్టుకోకుంటే ఎయిర్‌బ్యాగ్స్‌ యాక్టివ్‌ కావు. వాహనం ప్రమాదానికి లోనైనప్పుడు ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవాలంటే దానికి సంబంధించిన సెన్సర్లు యాక్టివేట్‌ కావాలి. డ్రైవింగ్‌సీటులో ఉన్న వ్యక్తి కచ్చితంగా సీటుబెల్టు పెట్టుకుంటేనే ఎయిర్‌బ్యాగ్‌ కంట్రోల్‌ యూనిట్‌ యాక్టివేట్‌ అవుతుంది. వాహనం బయల్దేరిన తర్వాత డ్రైవర్, పక్క వ్యక్తి సీటుబెల్టు పెట్టుకోకపోతే గుర్తు చేసేందుకు బీప్‌ శబ్దం కూడా వచ్చేలా తాజా వాహనాలకు ఏర్పాట్లు చేశారు.

మరిన్ని వార్తలు