సీట్ల సర్దుబాట్లపై నిరసనలు... ఆందోళన సెగలు

16 Nov, 2018 11:20 IST|Sakshi
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నివాసం ఎదుట ధర్నా చేస్తున్న ఖైరతాబాద్‌ కాంగ్రెస్‌ నేతలు

స్వతంత్రంగా పోటీ చేస్తానన్న భిక్షపతి యాదవ్‌

ఉప్పల్‌లో రాగిడి,మేడ్చల్‌లో తోటకూర సైతం..

కేఎల్‌ఆర్‌కు టికెట్‌ ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్‌ నేతల అసహనం

రాజేంద్రనగర్‌లో కార్తీక్‌రెడ్డి ఏర్పాట్లు

ఢిల్లీలో దీక్షకు దిగిన బండ కార్తీకరెడ్డి

దాసోజుకు టికెట్‌ ఎలా ఇస్తారంటూ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఇంటి ముట్టడి

ఇబ్రహీంపట్నం సీటు కేటాయింపుపై సామ రంగారెడ్డి అసంతృప్తి  

సాక్షి,సిటీబ్యూరో: ప్రజాకూటమి కుతకుతలాడుతోంది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల్లో అసమ్మతి సెగలు కక్కుతోంది. తమకే సీట్లు కేటాయిస్తారని ఆశపడ్డవారికి అధిష్టానం మొండిచేయి చూపించడంతో రెబల్స్‌గా తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. టీడీపీకి కేటాయించిన స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. కనీస కేడర్‌ లేని పార్టీకి పలు నియోకజవర్గాలు కట్టబెట్టడం కాంగ్రెస్‌ నేతలకు ఏ మాత్రం రుచించడం లేదు. దీంతో ఎవరికి వారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

మహేశ్వరం కాంగ్రెస్‌ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజేంద్రనగర్‌నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. రాజేంద్రనగర్‌లో ఏ మాత్రం బలంలేని టీడీపీకి పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనూకాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో శేరిలింగంపల్లిలో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు భిక్షపతి యాదవ్‌ ప్రకటించారు.

ఉప్పల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాగిరెడ్డి లక్ష్మారెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు తుది నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 17న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తలపెట్టారు. ఉప్పల్‌ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో లక్ష్మారెడ్డికి మంచి పట్టుంది. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఆశించి భంగపడ్డ తోటకూర జంగయ్య యాదవ్‌ సైతం ‘స్వతంత్ర’ పోటీకి సిద్ధమయ్యారు.  

సికింద్రాబాద్‌ స్థానాన్ని ఆశించిన మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి ఢిల్లీలో గురువారం రాహుల్‌గాంధీ నివాసం ఎదుట బైటాయించి నిరసనకు దిగారు. ఈ నియోజకవర్గం నుంచి ఆదం ఉమాదేవి, పల్లె లక్ష్మణరావుగౌడ్‌తో పాటు కాసాని జ్ఞానేశ్వర్‌ పేర్లను ఏఐసీసీ పరిశీలించింది. గురువారం సాయంత్రం ‘వివిధ కారణాలతో మీకు టికెట్‌ ఇవ్వడం లేదంటూ’ కార్తీకరెడ్డికి ఫోన్‌ రావడంతో ఢీల్లీలోనే ఉన్న ఆమె రాహుల్‌గాంధీ నివాసం ఎదుట ఆందోళన చేయడంతో ఆమెను తుగ్లక్‌రోడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అడ్రస్‌ లేని వ్యక్తిని కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించారంటూ ఖైరతాబాద్‌ నియోజక వర్గం కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. దాసోజు శ్రవణ్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించడాన్ని నిరసిస్తూ గురువారం వేలాది మంది కార్యకర్తలు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. బంజారాహిల్స్‌ రోడ్‌నెం. 12లోని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇంటి వద్ద బైఠాయించిన కార్యకర్తలు శ్రవణ్‌ను లిస్టు నుంచి తొలగించి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సి. రోహిణ్‌రెడ్డిని ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. నేతలు, కార్యకర్తలు పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేశారు. దిష్టిబొమ్మలు దహనం, నిరాహార దీక్షలతో నిరసన తెలిపారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మహాకూటమి అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఏకంగా టీడీపీ నిర్ణయం ఆయా పార్టీల నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది. సీట్ల సర్దుబాటులో  ఇబ్రహీంపట్నం టీడీపీ దక్కించుకుంది. టీడీపీ అభ్యర్థిగా సామ రంగారెడ్డి ప్రకటించింది. వాస్తవంగా  ఇబ్రహీంపట్నం సీటు కోసం కాంగ్రెస్‌ నాయకులు క్యామ మల్లేశ్, మల్‌రెడ్డి రంగారెడ్డి హోరాహోరీగా పోటీ పడ్డారు.    ఎల్‌బీనగర్‌ నుంచి సామ రంగారెడ్డి  పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చి ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు.  కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుధీర్‌రెడ్డి కూడా సీటుపై ఆశలు పెంచుకొని ప్రచారానికి దిగారు. దీంతో కలత చెందిన సామ రంగారెడ్డి అనుచరులు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు పెద్దఎత్తున వచ్చి ఆందోళన సైతం నిర్వహించారు. ఇదిలా ఉండగా అనూహ్యంగా ఇబ్రహీంపట్నం స్థానం టీడీపీకి సర్దుబాటు అయింది. సామ రంగారెడ్డికి అభ్యర్థిత్వం సైతం ఖరారు చేసింది. ఎల్‌బీనగర్‌ నుంచి పోటీ చేయాలని భావిస్తే ఇబ్రహీంపట్నం స్థానానికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం కంగు తినిపించింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మేడ్చల్‌ కాంగ్రెస్‌ టికెట్‌ కేఎల్‌ఆర్‌కు కేటాయిం చడం పట్ల స్వపక్షంలోనూ అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. గురువారం ఆ పార్టీ నేతలు తోటకూర జంగయ్య యాదవ్, ఉద్దమర్రి నర్సింహారెడ్డి తదితరులు విమర్శల వర్షం కురింపించారు.

ఖైరతాబాద్‌ టికెట్‌ ఆశించి భంగపడ్డ కార్పొరేటర్‌ విజయారెడ్డికి ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని పార్టీ అధినేత హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి సీఎం కేసీఆర్‌ విజయారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి హామీ ఇవ్వగా, గురువారం ఉదయం కేటీఆర్‌ సైతం ప్రగతిభవన్‌లో విజయారెడ్డి, ఆమె అనుచరులకు సైతం భరోసానిచ్చారు. అనంతరం ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌ విజయారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డి నివాసాలకు వెళ్లి మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు