మెరిట్‌కు పాతర.. సీట్ల జాతర

31 May, 2018 00:53 IST|Sakshi

అంగట్లో సరుకుగా ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ సీట్లు

టాప్‌ కాలేజీల్లో అడ్డగోలు దందా

ఎంసెట్‌ రాయనివారికీ సీట్ల కేటాయింపు

హైదరాబాద్‌ శివారులోని మరో 80కి పైగా కాలేజీల్లోనూ ఇవే అక్రమాలు

‘సాక్షి’ చేతిలో సీట్ల భర్తీ వివరాలు

మూడు అగ్రశ్రేణి కాలేజీల్లో భర్తీ అయిన మేనేజ్‌మెంట్‌ సీట్లు 663

ఒక్కో సీటుకు సగటున రూ.10 లక్షలు.. కోట్లలో డొనేషన్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కాలేజీల్లో అడ్డగోలు దందా సాగుతోంది. మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లు అంగడి సరుకులయ్యాయి. కొన్ని కాలేజీలు మెరిట్‌కు పాతరేసి సీట్లను బహిరంగంగా అమ్ముకుంటున్నాయి. వేలం మాదిరి రోజురోజుకూ డిమాండ్‌ పెంచి మరీ డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. బ్రాంచీని బట్టి ఒక్కో సీటుకు రూ.4 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. మెరిట్‌ కాదు కదా.. అసలు జేఈఈ ర్యాంకు, ఎంసెట్‌ రాయనివారికి కూడా సీట్లను అమ్మేసుకున్నాయి. 2017–18 విద్యా సంవత్సరం మేనేజ్‌మెంట్‌ కోటా అడ్మిషన్లలో లీలలివీ!

హైదరాబాద్‌ శివారులోని టాప్‌–3 కాలేజీల్లో 663 సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తే దాదాపు 490కి పైగా సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో సీటుకు సగటున రూ.10 లక్షల చొప్పున అమ్మకానికి పెట్టిన యాజమాన్యాలు కోట్లు గడించినట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులే పేర్కొంటున్నారు. టాప్‌ కాలేజీల్లోనే ఈ అడ్డగోలు దందా సాగిందంటే మిగతా కాలేజీల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ మూడు కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీ వివరాలను ‘సాక్షి’ సంపాదించింది. వాటిని పరిశీలించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

నిబంధనలకు విరుద్ధంగా.. 
గండిపేట ప్రాంతంలోని ఓ టాప్‌ కాలేజీలో మేనేజ్‌మెంట్‌ కోటాలో 285 సీట్లుంటే.. అందులో 152 సీట్లను ర్యాంకులు లేని వారికే కేటాయించారు. అందులో 93 మందికి ఎన్నారై కోటాలో, మిగతా 59 మందికి మేనేజ్‌మెంట్‌ కోటాలో సీట్లను కేటాయించారు. నిబంధనల ప్రకారం ఒక కాలేజీలోని 70 శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో ప్రవేశాల కమిటీ, మరో 30 శాతం సీట్లను మేనేజ్‌మెంట్లు భర్తీ చేస్తాయి. అందులో 15 శాతం సీట్లను ఎన్నారై/ఎన్నారై స్పాన్సర్డ్‌ కోటాలో కేటాయించాలి. మరో 15 శాతం సీట్ల భర్తీలో జేఈఈ మెయిన్‌ ర్యాంకర్లకు మొదటి ప్రాధాన్యం, ఎంసెట్‌ ర్యాంకర్లకు రెండో ప్రాధాన్యం ఇవ్వాలి.

ఎవరూ లేకుంటే ఇంటర్మీడియట్‌ మార్కుల ఆధారంగా సీట్లను కేటాయించాలి. కానీ ఎన్నారై కోటాలో 93 సీట్లను మాత్రమే భర్తీ చేసి, మేనేజ్‌మెంట్‌ కోటాలో 192 సీట్లను భర్తీ చేశారు. ఈ 192 సీట్లలోనూ 59 మంది జేఈఈ కానీ, ఎంసెట్‌ ర్యాంకుగానీ లేనివారే కావడం గమనార్హం. షేక్‌పేట ప్రాంతంలోని మరో కాలేజీలో 198 సీట్లను మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేస్తే అందులో 130 సీట్లను 20 వేలకు పైగా ర్యాంకు వచ్చిన వారికి కేటాయించారు. ఇందులో 50 వేల నుంచి 94 వేల వరకు ర్యాంకు వచ్చిన వారే 40 మంది వరకు ఉన్నారు. ఇక ఇబ్రహీంబాగ్‌ ప్రాంతంలోని మరో కాలేజీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇవే కాదు బయటకురాని మిగతా కాలేజీల్లోనూ మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల భర్తీలో నిబంధనలను తుంగలో తొక్కి యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్నాయి. 

వారికెలా సీట్లు వచ్చాయి?
రాష్ట్రంలోనే టాప్‌ కాలేజీలుగా పేర్కొనే వాటిల్లో జేఈఈ, ఎంసెట్‌ లేకుండా సీట్లు రావడం సాధ్యమేనా అంటే సాంకేతిక విద్యాశాఖ అధికారులు అసాధ్యం అని చెబుతున్నారు. టాప్‌ కాలేజీల్లోని మేనేజ్‌మెంట్‌ కోటా సీట్ల కోసం పోటీపడే వారిలో 10 వేల ర్యాంకు పైనున్న వారంతా ఉంటారు. 10 వేల ర్యాంకులోపు వారికి ఏదో ఒక మంచి కాలేజీలోనే సీట్లు వస్తాయి. పైగా 10 వేల ర్యాంకు వరకు ఎంత ఫీజు ఉంటే అంత ఫీజును ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రూపంలో ఇస్తుంది. కాబట్టి వారంతా కన్వీనర్‌ కోటాలోనే ఏదో ఒక మంచి కాలేజీలో చేరిపోతారు. మరీ టాప్‌ కాలేజీలోనే సీటు కావాలనుకునే వారు మాత్రమే డొనేషన్‌ చెల్లించి అయినా కోరుకున్న మేనేజ్‌మెంట్‌ కోటాలో చేరతారు. నిజానికి మేనేజ్‌మెంట్‌ కోటా, కన్వీనర్‌ కోటా ఫీజు సమానమే. కానీ ఏ ఒక్క టాప్‌ కాలేజీ కూడా ఆ కామన్‌ ఫీజుకు సీట్లు ఇవ్వడం లేదన్నది బహిరంగ రహస్యమే. అడ్డగోలు డొనేషన్లతో సీట్లను అమ్ముకోవడం వల్లే టాప్‌ కాలేజీల్లో 20 వేల నుంచి లక్షకు పైగా ర్యాంకులు ఉన్న వారికి కూడా సీట్లు వస్తున్నాయని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.  

ర్యాంకుతో పనేముంది?
గండిపేట, షేక్‌పేట, ఇబ్రహీంబాగ్‌ ప్రాంతాల్లోని ఆ టాప్‌–3 కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో 663 సీట్లను భర్తీ చేస్తే.. అందులో ఎంసెట్‌ ర్యాంకుగానీ, జేఈఈ ర్యాంకుగానీ లేని 167 మందికి ఇంజనీరింగ్‌ సీట్లను కేటాయించాయి. 20 వేలలోపు ర్యాం కుతో సీట్లు పొందిన విద్యార్థులు కేవలం 170 మందే ఉన్నారు. 50 వేల ర్యాంకు నుంచి లక్షకు పైగా ర్యాంకు వచ్చిన వారు 85 మంది విద్యార్థులున్నారు. 21 వేల నుంచి 50 వేల లోపు ర్యాంకు వచ్చిన మరో 241 మంది విద్యార్థులు ఈ టాప్‌ కాలేజీల్లో సీట్లు పొందినట్లు బయటపడింది. ఇవేకాదు ఘట్‌కేసర్, ఇబ్రహీంపట్నం, బాచుపల్లిలోని టాప్‌ కాలేజీలతోపాటు నగర శివారుల్లోని మరో 80కి పైగా కాలేజీల్లో కూడా ఇదే దందా సాగుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు