తొలివిడత లోపాలపై అప్రమత్తం 

23 Jan, 2019 01:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని పోలింగ్‌ స్టేషన్లలో సిబ్బంది సరైన పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించకపోవడం పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) అప్రమత్తమైంది. 25, 30న జరిగే రెండో, మూడో విడత ఎన్నికల్లో ఇలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. సోమవారం జరిగిన మొదటిదశ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన గుర్తింపుకార్డుల కోసం పట్టుబట్టకుండా కేవలం ఓటర్‌ స్లిప్పుల ఆధారంగానే ఓటు వేసేందుకు సిబ్బంది అనుమతించడంతో కొన్నిచోట్ల ఒకరికి బదులు మరొకరు ఓటు వేయడంతో ఎన్నికల వాయిదాకు అవకాశం ఏర్పడింది. వార్డు మెంబర్, సర్పంచ్‌ స్థానాలకు బ్యాలెట్‌ పేపర్లు ఒకటి తర్వాత మరొకటి ఇవ్వాల్సి ఉండగా, ఒకేసారి రెండూ ఇవ్వడంతో కొందరు ఓటర్లు ఒకే ఓటు వేయడం, మరో బ్యాలెట్‌ పేపర్‌పై ముద్ర సరిగా పడకపోవడం జరిగింది. కొన్ని పోలింగ్‌ స్టేషన్లలో బ్యాలెట్‌ పేపర్లను మడతపెట్టకుండా ఇవ్వడంతో ఓటర్లు వాటిని సరిగా మడవకపోవడంతో దాని లోని ఇంక్‌ ముద్ర మరో ఎన్నికల చిహ్నానికి తగి లి, ఓటును తిరస్కరించే అవకాశం ఏర్పడింది. 

గుర్తింపు డాక్యుమెంట్లు చూపాల్సిందే 
పోలింగ్‌స్టేషన్‌ నంబర్‌ గుర్తింపునకే ఫొటోతో కూడిన ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తామని, ప్రతి ఓటరూ ఓటుహక్కు వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరు ఐడీ లేదా మరో 18 ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాలు చూపించాలని ఎస్‌ఈసీ సూచించింది. మొదట వార్డు మెంబర్‌ స్థానానికి ఓటు వేశాకే, సర్పంచ్‌ బ్యాలెట్‌ పేపర్‌ను ఓటర్లకు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ కేంద్రంలో సంబంధిత ఎంపీడీఓ, రిటర్నింగ్‌ అధికారి సరైన సంఖ్యలో బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ జరిగిందా లేదా అన్నది సరిచూసుకోవాలని స్పష్టం చేసింది. రెండు, మూడు దశల ఎన్నికల్లో ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఎస్‌ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ మంగళవారం ఓ సర్క్యులర్‌ జారీచేశారు.  

అధికారులు, సిబ్బందికి అభినందన 
పండుగ రోజుల్లోనూ కష్టపడి పనిచేసి తొలి విడత ఎన్నికలు విజయవంతంగా ముగించడం పట్ల దాదాపు లక్షన్నర మంది అధికారులు, సిబ్బంది, పోలీసులను ఎస్‌ఈసీ అభినందించింది. రెండో, మూడో విడత ఎన్నికలను మరింత మెరుగ్గా నిర్వహించేలా ఈ ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన వారంతా కృషి చేయాలని విజ్ఞప్తి చేసింది. అధికారులు, అభ్యర్థులకు, ఎన్నికల నిర్వహణకు టీ–పోల్‌ సాఫ్ట్‌వేర్‌ చాలా ఉపయోగపడిందని పేర్కొంది. టీ–పోల్‌ సాఫ్ట్‌వేర్‌ కల్పించిన అవకాశంతో 357 మంది సర్పంచ్, 526 మంది వార్డుమెంబర్‌ అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే తమ నామినేషన్లు సమర్పించినట్టు వెల్లడించింది.  

>
మరిన్ని వార్తలు