గడువులోగా ఖర్చు వివరాలు సమర్పించాలి

1 Feb, 2019 00:37 IST|Sakshi

పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు స్పష్టంచేసిన ఎస్‌ఈసీ

పరిమితి మించినట్టు ఆధారాలు చూపితే ఎన్నిక రద్దు

మీడియాతో ఎస్‌ఈసీ వి.నాగిరెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు 45 రోజుల నిర్ణీత గడువులోగా ఎన్నికల వ్యయ వివరాలను ఎంపీడీవోలకు సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) వి.నాగిరెడ్డి స్పష్టంచేశారు. అభ్యర్థులు వ్యయ పరిమితిని మించి చేసిన ఎన్నికల ఖర్చును ఆధారాలతో రుజువు చేయగలిగితే గెలిచిన అభ్యర్థిని మూడేళ్లు పోటీకి అనర్హుడిగా ప్రకటించడంతోపాటు, ఆ ఎన్నిక రద్దుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇందుకు సంబంధించి కచ్చితమైన ఆధారాలను ఎంపీడీవోలతోపాటు నేరుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి కూడా తీసుకురావొచ్చని తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో గురువారం ఎస్‌ఈసీ కార్యాలయంలో కార్యదర్శి అశోక్‌కుమార్, సంయుక్త కార్యదర్శి జయసింహారెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థుల వ్యయ నివేదికను ఎవరైనా రూ.200 చెల్లించి తీసుకునే వెసులుబా టు ఉందని చెప్పారు. ఎన్నికను ప్రభావితం చేసే లా డబ్బు, మద్యం పంపిణీ జరిగినట్లు వార్తాపత్రికల్లో వచ్చాయన్నారు. అయితే ఇలాంటి విషయాలు అందరికీ తెలుస్తుంటాయని, దీనికి సం బంధించి ఆధారాలు చూపితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 500 జనాభా కంటే ఎక్కువగా ఉన్న పంచాయతీల్లో రూ.రెండున్నర లక్షలు, 500లోపు జనాభా ఉన్న గ్రామాల్లో రూ.లక్షన్నర మేర వ్యయం చేసేందుకు అభ్యర్థులకు పరిమితి ఉందని చెప్పారు. ఎన్నికల ఖర్చు పరిశీలనకు 39 మంది ఎన్నికల పర్యవేక్షణాధికారుల ను, 600 మంది సహాయ పర్యవేక్షణాధికారులను నియమించామని, ఎక్కువ డబ్బు ఖర్చు చేసిన చోట వారు షాడో రిజిష్టర్లు నిర్వహించారని చెప్పారు.
 
వాటి ఆధారంగా చర్యలు తీసుకోలేం.. 
ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి తాము ఇచ్చిన డబ్బును తిరిగివ్వాలంటూ కొందరు కోరుతున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వీడియోలపై ఎవరైనా ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.  

మే, జూన్‌లలో ప్రజా పరిషత్‌ ఎన్నికలు.. 
రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే మండల, జిల్లా ప్రజా పరిషత్‌లకు మే, జూన్‌లలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని చెప్పారు. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీల కాలపరిమితి ముగియనుందని, అంతకంటే 3 నెలల ముందే ఈ ఎన్నికలు నిర్వహించవచ్చని తెలిపారు. అలాగే మున్సిపాలిటీలకు మే, జూన్‌లలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. దొంగ ఓటు వేసినట్టు రుజువైతే ఐదేళ్ల జైలుశిక్ష, సహకరించినవారికీ అంతే శిక్ష విధించే అవకాశాలున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చితే రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు పరిమితమైన అధికారాలు, అంతంత మాత్రం నిధులతోనే నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 90 శాతం వరకు ఓటింగ్‌ ఎందుకు నమోదు అయ్యిందో రాజకీయ శాస్త్రవేత్తలు, విశ్లేషకులు వివరించాల్సి ఉంటుందన్నారు. పార్టీ రహితంగా పంచాయతీ ఎన్నికలు జరిగినందున, ఫలానా పార్టీ మద్దతిచ్చిన, బలపరిచిన వ్యక్తి గెలిచాడంటూ పత్రికల్లో రాయొద్దని కోరారు. 

మరిన్ని వార్తలు