భద్రాచలం వద్ద గోదారిపై రెండో వంతెన

20 Oct, 2014 04:18 IST|Sakshi
భద్రాచలం వద్ద గోదారిపై రెండో వంతెన

* నిర్మాణానికి రూ.80 కోట్లు
* ఇప్పటికే ప్రారంభమైన పనులు  
* రెండేళ్లలో అందుబాటులోకి..
భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నదిపై మరో బ్రిడ్జి నిర్మాణానికి పనులు ప్రారంభమయ్యాయి.  భద్రాచలంలో జరిగే ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతవాసులు రెండో బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో బ్రిడ్జి నిర్మాణానికి రూ.80 కోట్లు మంజూరు చేయగా, ఇటీవలే పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న బ్రిడ్జికి ఆనుకొని ఎగువ ప్రాంతంలో మరో వంతెన నిర్మిస్తున్నారు. ఇప్పట్లో గోదావరి నదికి వరదలు వచ్చే అవకాశం లేకపోవటంతో వచ్చే మార్చివరకు పనులు చేసేందుకు ఎన్‌హెచ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

గోదావరిలో పిల్లర్ల నిర్మాణానికి ప్రస్తుతం బ్రిడ్జికి ఇరువైపులా ర్యాంప్ నిర్మిస్తున్నారు. పటిష్ట నిర్మాణానికి అనుగుణంగా ఉండేందుకుగోదావరి ఇవతలి ఒడ్డు నుంచి సార పాక అవతలి ఒడ్డు వరకు మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. గతంలో ఉన్న బ్రిడ్జి మాదిరిగానే 37 పిల్లర్లు నిర్మిస్తున్నట్లు ఎన్‌హెచ్ ఈఈ చంద్రశేఖర్ తెలిపారు. పాదచారులకు సౌకర్యంగా ఉండేందుకు కొత్తగా నిర్మించే బ్రిడ్జికి ఇరువైపులా ఫుట్‌పాత్‌లను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2016 డిసెంబర్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.
 
త్వరలోనే శంకుస్థాపన..
గోదావరి నదిపై నిర్మించే రెండో బ్రిడ్జి నిర్మాణం చరిత్రాత్మకంగా నిలిచిపోయే అవకాశం ఉన్నందున దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతోగానీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతోగానీ శంకుస్థాపన చేయించేందుకు ఎన్‌హెచ్ అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. వచ్చే నెలలో కేసీఆర్ భద్రాచలం వచ్చే అవకాశం ఉందని, అదే రోజు ఈ శంకుస్థాపన ఉండొచ్చని సమాచారం. అయితే వెంకయ్యనాయుడుతో శంకుస్థాపన చేయించాలని రాష్ట్ర బీజేపీ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
 
నాడు రూ.70 లక్షలు.. నేడు రూ.80 కోట్లు
భద్రాచలం వద్ద గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న బ్రిడ్జిని రూ.70 లక్షల వ్యయంతో పూర్తి చేశారు. 1959 డిసెంబర్ 16న అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేయగా, 1965 జులై 13న రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. 3934 అడుగుల పొడవు, 37 పిల్లర్లు, ఒక్కో పిల్లర్ మధ్య 106.6 అడుగుల దూరంతో బ్రిడ్జి నిర్మించారు. ఇప్పటికీ ఇది పటిష్టంగానే ఉన్నప్పటికీ  ఇది జాతీయ రహదారి అయినందున భవిష్యత్‌లో రవాణా అవసరాల దృష్ట్యా  మరో బ్రిడ్జి నిర్మించాలని జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపడంతో కేంద్రం నిధులు మంజూరు చేయగా, పనులు మొదలయ్యాయి.

మరిన్ని వార్తలు