ఎరుపెక్కిన నల్లగొండ

3 Feb, 2018 03:15 IST|Sakshi

రేపటి నుంచి సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలు   

నల్లగొండ టౌన్‌: సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభలకు నల్లగొండ ముస్తాబైంది. ఈ నెల 4వ తేదీ నుంచి 4 రోజులపాటు జరిగే ఈ సభలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎర్ర జెండాలు, ఎర్ర తోరణాలతో పట్టణమం తా ఎరుపుమయమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు మహాసభలు ప్రారంభమవుతాయి. ముందుగా పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఐదువేల మంది రెడ్‌షర్ట్‌ వలంటీర్లతో కవాతు చేస్తారు.

ప్రారంభ సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాల్గొంటారు. అనంతరం ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది. సభలో జాతీయ, రాష్ట్ర స్థాయి సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి తదితర అంశాలతో పాటు బహుజన ఫ్రంట్‌ ఏర్పాటు విషయం పై చర్చించనున్నారు. ఈ సభలకు రాష్ట్రంలోని 31 జిల్లాలకు చెందిన నేతలు, 800 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. మహాసభల విజయవంతం కోసం  అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.   15 రోజులుగా కళాకారులు  ఆటాపాటలతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  

నేడు ఫొటో ఎగ్జిబిషన్‌: సభల సందర్భంగా నల్లగొండ లోని అంబేద్కర్‌ భవన్‌లో  శనివారం ఫొటోలు, కార్టూన్‌న్లతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు