రెండో విడత రేషన్‌

2 May, 2020 10:29 IST|Sakshi
బియ్యం తీసుకునేందుకు రేషన్‌షాపు వద్ద క్యూలో నిల్చున్న కార్డుదారులు (ఫైల్‌)

బియ్యం పంపిణీ షురూ   1.88 లక్షల కార్డుదారులకు ప్రయోజనం 

జిల్లాకు రాని కందిపప్పు 

రూ.1500 సాయం కోసం ఎదురుచూపు

ఆదిలాబాద్‌అర్బన్‌: కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెల్లరేషన్‌ కార్డుదారులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటోంది. నెల రోజులకుపైగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఏప్రిల్‌లో ఉచిత బియ్యం, రూ.1500 సాయం చేయగా, ఈ నెలలో రెండో విడత సాయానికి సిద్ధమైంది. రెండో విడత బియ్యం పంపిణీ ప్రక్రియ జిల్లాలో శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అయితే బియ్యంతోపాటు కిలో కందిపప్పు కూడా పంపిణీ చేయనుంది. కార్డుదారులు చౌకధరల దుకాణాలకు వెళ్లి బియ్యం, ఇతర సరుకులు తీసుకుంటున్నారు. బయోమెట్రిక్‌ ద్వారా పంపిణీ జరుగుతున్నందున సరుకులు తీసుకునేందుకు వచ్చిన ప్రజలు భౌతికదూరం పాటించడంతోపాటు మాస్కు ధరించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చేతులు శుభ్రం చేసుకొని వేలిముద్ర వేసి సరుకులు తీసుకెళ్తున్నారు. 

రెండో విడత బియ్యం పంపిణీ  
సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగ కూడదనే ఉద్దే శంతో ప్రభుత్వం మే నెలలో కూడా ఉచితంగా బి య్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. రేషన్‌కార్డు కలిగిన కుటుంబంలో ప్రతిఒక్కరికి 12 కిలోల బి య్యం ఏప్రిల్‌లో పంపిణీ చేసింది. లాక్‌డౌన్‌తో గత నెల రోజులుగా ఇబ్బందులు పడిన ప్రజల కష్టాలు కొంతవరకు దూరమయ్యాయి. జిల్లాలోని 355 రేషన్‌ షాపులుండగా, 1,88,549 కార్డులు, వాటి ప రిధిలో 6 లక్షలపైగా మంది సభ్యు లు (యూనిట్లు) ఉన్నారు. వీరందరికీ బియ్యం పంపిణీ చేసేందుకు జిల్లాకు 8,032 మెట్రిక్‌ టన్నుల బియ్యం కావల్సి వచ్చింది. కొన్ని రోజులుగా ప్రజలెవరూ బయటకు వెళ్లడం లేదు. దీంతో పనులు లేక పొట్ట గడవడం ఇబ్బందిగా మారుతోంది. అయితే రెండు నెలల నుంచి ఉచిత బియ్యం అందజేస్తుండడంతో కొంత ఉపశమనం కలిగింది. ఇదిలా ఉండగా, కార్డుదారులకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు ఇంకా జిల్లాకు చేరలేదు. కార్డుదారుడికి ఒక కిలో చొప్పున జిల్లాకు 1,885.49 క్వింటాళ్ల కందిపప్పు రావల్సి ఉంది. 

రేషన్‌ తీసుకోని వారు 16,615 మంది
గత మూడు నెలల నుంచి రేషన్‌ బియ్యం తీసుకోకపోవడంతో వారికి నగదు జమకావడం లేదు. జిల్లాలో 18 మండలాల పరిధిలో 1,88,549 కార్డులు ఉండగా, 1,71,769 మందికి సాయం అందింది. మిగతా వారిలో 165 మంది బ్యాంకు ఖాతాలు తప్పుగా ఉండగా, 16,615 మంది కార్డుదారులు గత మూడు నెలలుగా బియ్యం తీ సుకోవడం లేదు. దీంతో వీరిని ప్రభుత్వం హోల్డ్‌లో పెట్టింది. అయితే వీరికి ఇంతవరకు నగదు జమ కాలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే తప్ప హోల్డ్‌లో పెట్టిన రేషన్‌కార్డులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని అధికారులు పేర్కొంటున్నారు.

రూ.1500 సాయం కోసం  
లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతర సరుకులు కొనుగోళు చేసేందుకు ప్రభుత్వం రూ.1500 సాయం ప్రకటించింది. ఏప్రిల్‌లో కార్డు కలిగిన వారి పేరున బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేసింది. మే నెలలో కూడా సాయం చేస్తామని ప్రకటించడంతో ఆ డబ్బుల కోసం కార్డుదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాలో గత ఏప్రిల్‌ నెలలో 1,59,956 కార్డుదారులు బ్యాంకుల నుంచి తీసుకుంటే, 11,813 మంది పోస్టాఫీసుల నుంచి నగదు తీసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు