నేటి నుంచి కాంగ్రెస్‌ రెండో విడత యాత్ర

1 Apr, 2018 02:00 IST|Sakshi

పది రోజుల పాటు 17 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర

రామగుండంలో మొదలై వరంగల్‌లో ముగింపు

కొంత విరామం అనంతరం మరో విడత యాత్ర

కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతనోత్తేజానికి నేతల వ్యూహం

సాక్షి, హైదరాబాద్ ‌: క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం నింపడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడం కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ చేపట్టిన బస్సుయాత్ర రెండో విడత ఆదివారం నుంచి ప్రారంభమవుతోంది. తొలివిడతలో భాగంగా ఫిబ్రవరి 26న చేవెళ్లలో చేపట్టిన బస్సుయాత్ర.. మార్చి 3న హుజూరాబాద్‌లో ముగిసింది. మధ్యలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన నేపథ్యంలో.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రెండో విడత యాత్రను చేపట్టాలని టీపీసీసీ నిర్ణయించింది. అనుకున్న కార్యాచరణ ప్రకారం.. ఆదివారం రామగుండంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో రెండో విడత బస్సు యాత్ర మొదలవనుంది. 

అధికార టీఆర్‌ఎస్‌ను ఎండగడుతూ.. 
రామగుండంలో మొదలయ్యే కాంగ్రెస్‌ బస్సు యాత్ర ఏప్రిల్‌ 2న పెద్దపల్లి, 3న మంథని, భూపాలపల్లి, 4న స్టేషన్‌ ఘన్‌పూర్, పాలకుర్తి, 5న నర్సంపేట్, 6న పరకాల, వరంగల్‌ వెస్ట్, 7న ఇల్లెందు, పినపాక, 8న డోర్నకల్, మహబూబాబాద్, 9న భద్రాచలం ఆలయ దర్శనం, వెంకటాపురం మీటింగ్, ములుగులో యాత్ర, 10న వర్ధన్నపేట, వరంగల్‌ ఈస్ట్‌లలో కొనసాగుతుంది. వరంగల్‌లోనే రెండో విడత యాత్ర ముగింపు సభ నిర్వహించనున్నట్టు టీపీసీసీ ప్రకటించింది. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం అందిం చేలా ఈ బస్సుయాత్రను చేపట్టినట్టు నేతలు చెబుతున్నారు. రెండో విడత ముగిశాక 2, 3 రోజుల విరామం అనంతరం మరో విడత బస్సుయాత్రను చేపట్టనున్నారు. 

మరిన్ని వార్తలు