నేటి నుంచి ‘ఆసరా’ రెండో విడత

10 Dec, 2014 06:31 IST|Sakshi
నేటి నుంచి ‘ఆసరా’ రెండో విడత

పాతిక లక్షలకు పైగా లబ్ధిదారుల గుర్తింపు  
 22 లక్షల మందికి మంజూరు ఉత్తర్వులు జారీ  
రెండు నెలల పింఛన్ పంపిణీకి రూ.613 కోట్లు

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రెండోవిడత ‘ఆసరా’ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం యంత్రాంగం సమాయత్తమైంది. బుధవారం నుంచి ఈనెల 15 వరకు జరగనున్న పింఛన్ల పంపిణీ నిమిత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) అన్ని ఏర్పాట్లు చేసింది. ఆసరా పింఛన్ పథ కాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గతనెల్లో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. లబ్ధిదారుల ఎంపిక, పింఛన్ల మంజూరు ప్రక్రియలో తీవ్ర జాప్యం ఏర్పడడంతో మొదటి విడత పంపిణీలో కొద్దిమందికే నవంబర్ పింఛన్ అందజేశారు. తాజాగా కొత్త లబ్ధిదారులు కూడా తోడవడంతో వీరందరికీ నవ ంబర్, డిసెంబర్ (రెండు) నెలల పింఛన్ మొత్తాన్ని బుధవారం నుంచి అందజేయాలని అధికారులు నిర్ణయించారు.
 
 రూ.613 కోట్ల పంపిణీ..
 ఆసరా పింఛన్ కోసం సుమారు 39 లక్షల దరఖాస్తులు అందగా ఇప్పటివరకు 25,920,90 మందిని అర్హులుగా గుర్తించారు. కొన్ని జిల్లాల్లో సాఫ్ట్‌వేర్ ఇబ్బందుల కారణంగా పింఛన్ మంజూరు ఉత్తర్వుల జారీకి ఆటంకం ఏర్పడిం ది. మంగళవారం నాటికి మొత్తం 22,13,901 మందికి ఆయా జిల్లాల కలెక్టర్లు పింఛన్ ఉత్తర్వులు జారీచేశారు. వీరందరికీ బుధవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నారు. లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ పంపిణీ నిమిత్తం మొత్తం రూ.613.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే సుమా రు రూ.453 కోట్లు ఆయా జిల్లాలకు పంపామని, మిగిలిన సొమ్మును కూడా రెండ్రోజుల్లో పంపనున్నట్లు సెర్ప్ అధికారులు తెలిపారు.
 
 కమిటీల పర్యవేక్షణలో..
 ప్రభుత్వం నియమించిన కమిటీల పర్యవేక్షణలోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరగనుంది. గ్రామ కమిటీలను మండల ఎంపీడీవో, పట్టణ/నగర కమిటీలను మున్సిపల్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ పరిధిలోని రంగారెడ్డి జిల్లా నగర కమిటీలను ఉప కమిషనర్లు, హైదరాబాద్ జిల్లాలో కమిటీలను మండల తహశీల్దార్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి కమిటీలనూ ఐదుగురు సభ్యులు ఉంటారు. గ్రామస్థాయి కమిటీలో.. సర్పంచ్, పంచాయితీ కార్యదర్శి, స్థానిక వార్డు సభ్యుడు, ఎస్సీ/ఎస్టీ వార్డు సభ్యుడు, గ్రామ సమాఖ్య సభ్యురాలు ఉంటారు. పట్టణ/నగర కమిటీలో.. వార్డు కౌన్సిలర్/డివిజన్ కార్పొరేటర్, బిల్ కలెక్టర్/ వీఆర్వో, మురికివాడలకు చెందిన వార్డు సభ్యుడు, ఎస్సీ/ఎస్టీ వార్డు సభ్యుడు, పట్టణ/నగర సమాఖ్య సభ్యురాలు తప్పనిసరిగా ఉంటారు.

మరిన్ని వార్తలు