రెండో విడత పరిషత్‌ పోరు ప్రశాంతం

11 May, 2019 05:27 IST|Sakshi

77.63 శాతం పోలింగ్‌ నమోదు 

యాదాద్రి భువనగిరి జిల్లాలోఅత్యధికంగా 85.33 శాతం పోలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ పోరులో భాగంగా శుక్రవారం జరిగిన రెండో విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ విడతలోనూ ఓటర్లు భారీగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 85.33 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ములుగు జిల్లాలో అత్యల్పంగా 69.89 శాతం పోలింగ్‌ జరిగింది. ఏడు జిల్లాల్లో పోలింగ్‌ 80 శాతం దాటగా, ఒక్క ములుగు జిల్లా మినహా అన్నిచోట్లా 70 నుంచి 80 శాతం మధ్యలో ఓటింగ్‌ నమోదైంది. మొత్తమ్మీద రెండో విడత పరిషత్‌ ఎన్నికల్లో 77.63 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండో విడతలో భాగంగా 1,850 ఎంపీటీసీ స్థానాల్లో 6,083 మంది, 179 జెడ్పీటీసీ స్థానాల్లో 805 మంది (ఏకగ్రీవమైన ఒక జెడ్పీటీసీ, 63 ఎంపీటీసీ స్థానాలు మినహాయించి) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రెండో విడత పరిషత్‌ ఎన్నికల కోసం 10,371 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయగా, 862 బూత్‌లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించింది. ఎస్‌ఈసీ ప్రధాన కార్యాలయం నుంచి, జిల్లాల్లోని కార్యాలయాల నుంచి వెబ్‌ కాస్టింగ్‌ సరళిని అధికారులు పర్యవేక్షించారు. నక్సల్‌ ప్రభావిత ప్రాబల్యం ఉన్న 218 ఎంపీటీసీ స్థానాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగించారు. మిగిలిన చోట్ల సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలంలో కొంత మంది తమ ఓట్లు గల్లంతయాంటూ అధికారులకు ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు