గొర్రెలు యాడబోయె..!

26 Aug, 2019 10:17 IST|Sakshi

రెండో విడత పంపిణీకి మోక్షమేది..?

ఉమ్మడి జిల్లాలో 47,750 యూనిట్లు లక్ష్యం

3,787 యూనిట్లు పంపిణీ చేశాక బ్రేక్‌..

ఎనిమిది నెలలుగా డీడీలు చెల్లించి ఎదురుచూపులు

సాక్షి, వరంగల్‌: గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు మోక్షం కలిగేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించిన వారిపై విచారణ ముమ్మరమైంది.  ఈ అక్రమాలపై ఓ వైపు కోర్టు కేసు.. మరోవైపు శాఖాపరమైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి. 

గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించిన వారి అవినీతి అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. కొందరు అధి కారుల నిర్లక్ష్యం, కక్కుర్తి, దళారుల ప్రలోభాల కారణంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం అబాసుపాలైన విషయం తెలిసిందే. ఇదే పథకంలో అక్రమాలపై ఓ వైపు కోర్టులో ‘పిల్‌’పై విచారణ.. మరోవైపు శాఖాపరమైన ఎంక్వైరీలు జరుగుతుండటంతో రెండో విడత పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి.  ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 47,750 యూనిట్లు పంపిణీ లక్ష్యం కాగా 3,787 యూనిట్లు పంపిణీ చేసిన తర్వాత బ్రేక్‌ వేశారు. లబ్ధిదారులు డీడీ(డిమాండ్‌ డ్రాఫ్ట్‌) కట్టి ఆరు నెలలు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. 

మొదటి విడతలో అక్రమాలు ఇలా..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 575 సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 60 వేల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే మొదటి విడతలో ప్రభుత్వం యాదవులను మాత్రమే పెంపకందారులుగా గుర్తించింది. విడతల వారీగా అర్హులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు మొదటి విడత(ఎ–లిస్టు)లో 50,678 యూనిట్లు మంజూరు చేసింది. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించి పంపిణీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది ఒక కమిటీగా మొత్తం ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ జరిగింది.

మహారాష్ట్రతో పాటు కడప జిల్లాలోని ఆరు మండలాల్లో గొర్రెల కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. వాటికి ఇన్సూరెన్స్‌ ట్యాగ్‌లు పూర్తయిన అనంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా జిల్లాకు పంపాల్సి వుండగా.. ఇక్కడే అనేక అక్రమాలు జరిగినట్లు ఒక్కటొక్కటిగా బయటకు వచ్చాయి. వరంగల్‌ పాత జిల్లా పరిధిలో 50,678 యూనిట్లకుగాను అధికారులు 49,276 యూనిట్లు(97 శాతం) గ్రౌండింగ్‌ చేయగా.. చాలా చోట్ల రీ–సైక్లింగ్‌ జరిగినట్లు ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన డీవీఅండ్‌ఏహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.బాలకిషన్, జనగామ జిల్లా బచ్చన్నపేట వీఏఎస్‌ డాక్టర్‌ కె.హరికిషన్‌లపై చర్యలకు ఈ బృందం ఫెడరేషన్‌ ఎండీకి సిఫారసు చేసింది.   కొనుగోలు పథకంలో జరిగిన అక్రమాల జాబితాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌  రంగంలోకి దిగడం కలకలం రేపుతోంది. 

రెండో విడత ఇప్పట్లో లేనట్టేనా..?
రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్‌ రూరల్‌లో 12,748, మహబూబాబాద్‌లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్క వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనే సుమారు 4,200 మందికిపైగా డీడీలు చెల్లించగా 1,349 యూనిట్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. అయితే ఇదే సమయంలో మొదటి విడతలో పలుచోట్ల లెక్కలేనన్ని అవినీతి అక్రమాలు జరగడం.. అవి ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తుండటంతో మొత్తానికే పంపిణీ నిలిపి వేశారు. ఇదిలా ఉండగా గొర్రెల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లేనన్ని భావించిన పశు సంవర్థకశాఖ అధికారులు వర్షాకాలం ప్రారంభం కావడంతో సుమారు నెలన్నర నుంచి పశువుల రోగనిరోధక చర్యల్లో భాగంగా నట్టల మందు, గాలికుంటు వ్యాధి, చిటుకు రోగాల నివారణ టీకాలు ఇచ్చే పనిలో ఉన్నారు. పెద్దరోగం(పీపీఆర్‌) లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందన్న సంకేతాలతో ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం మరో 25 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఇప్పట్లో మొదలు కాకపోవచ్చనే అధికారులు చెప్తున్నారు.  

మరిన్ని వార్తలు