సచివాలయంలో నేడు కేబినెట్ భేటీ

23 Nov, 2014 01:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం సాయంత్రం సచివాలయంలో జరుగనుంది. అసెంబ్లీ సమావేశాలను మరో ఐదు రోజులు పొడిగించిన నేపథ్యంలో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహం, వివిధ శాఖలకు కేటాయించిన పద్దులు, బిల్లులు, డిమాండ్లు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నట్టు తెలిసింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర పారిశ్రామిక విధానం బిల్లును కూడా  ఆమోదించే అవకాశాలున్నాయి. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, వాటర్‌గ్రిడ్, ఇసుక విధానం వంటి అంశాలపైనా చర్చించనున్నారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరుపెట్టకుండా యథాతథ స్థితిని కొనసాగించడంపై మంత్రివర్గం తీర్మానించే అవకాశమున్నట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. తొలుత కేబినెట్ సమావేశాన్ని సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లుగా మంత్రులకు సమాచారం అందింది. కానీ, అసెంబ్లీ సమావేశాలు ఉదయం 10 గంటలకే ప్రారంభం కానుండడంతో ఆ లోపు భేటీ సాధ్యంకాదని అభిప్రాయం వచ్చింది. దీంతో ఆదివారం సాయంత్రమే కేబినెట్ భేటీ నిర్వహించాలని సీఎం  నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు