‘రియల్’ దందా కోసమే సచివాలయం తరలింపు'

12 Feb, 2015 22:08 IST|Sakshi
‘రియల్’ దందా కోసమే సచివాలయం తరలింపు'

హైదరాబాద్ సిటీ : రియల్ ఎస్టేట్ దందా కోసమే ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపు యోచన చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఛాతీ ఆస్పత్రి, సచివాలయం తరలింపును వ్యతిరేకిస్తూ గురువారం ఓ సదస్సును నిర్వహించారు.

ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... పది కమ్యూనిస్టు పార్టీలు సీఎంను కలవాలని అనుమతి కోరితే ఇంత వరకు కనికరించలేదన్నారు. వాస్తు ప్రకారంగా పాలించడం రాజ్యాంగ విరుద్ధమని వీరభద్రం అన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఏకపక్షంగా తీసుకునే నిర్ణయాలను ప్రజలు సహించరని ఆయన చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా రోజుకో హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. నిజాం కాలంలో స్థాపించిన ఆస్పత్రిని తరలించడం సబబుకాదని చాడ వెంకట్ రెడ్డి అన్నారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ... ప్రభుత్వ నిర్ణయాలకు ప్రాతిపదిక రాజ్యాంగంలో ఉన్న విలువలని అన్నారు. నగరాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెట్టుబడులను తీసుకొస్తూ ధ్వంసం చేస్తున్నారని అన్నారు.

సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు కె.గోవర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నిమ్స్ మాజీ డెరైక్టర్ రాజారెడ్డి, ప్రొఫెసర్ రమా మేల్కోటే, ఎంసీపీఐయూ నాయకులు ఎం.డి.గౌస్, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి తిప్పర్తి యాదయ్య, ఆర్‌ఎస్పీ నాయకులు జానకిరాము, ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు సురేందర్, ప్రొఫెసర్ చక్రధర్ రావు, నాయకులు భూతం వీరయ్య తదితరులు పాల్గొన్నారు.

 

>
మరిన్ని వార్తలు