ఎర్రగడ్డకు సచివాలయం?

28 Jan, 2015 11:31 IST|Sakshi
ఎర్రగడ్డకు సచివాలయం?

వేగంగా కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
టీబీ ఆసుపత్రిని అనంతగిరికి తరలిస్తూ ఉత్తర్వులు
ఖాళీ అయిన స్థలంలో కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి యోచన
నిర్మాణ డిజైన్లపై అధికారులతో సీఎం సమీక్ష
ఎనిమిది బ్లాక్‌లతో అధునాతన భవనాలు నిర్మించాలని సూచన


సాక్షి, హైదరాబాద్: రాజధాని నగరం నడిబొడ్డున.. హుస్సేన్‌సాగర్ సమీపంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనాల సముదాయాన్ని తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కోట్లాది రూపాయల విలువైన ఈ స్థలాన్ని విక్రయించటం ద్వారా భారీగా ఆదాయం సమకూరటంతోపాటు హుస్సేన్‌సాగర్ చుట్టూ న్యూయార్క్ తరహాలో ఆకాశహర్మ్యాలు నిర్మించాలనే బృహత్తర లక్ష్యం నెరవేరుతుందని యోచిస్తోంది.

ఇందులో భాగంగా ప్రస్తుతం ఎర్రగడ్డలో ఉన్న ప్రభుత్వ క్షయ (టీబీ), ఛాతీ ఆసుపత్రిని రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపంలోని అనంతగిరి క్షయ ఆసుపత్రికి తరలించాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మరమ్మతులు, పునరుద్ధరణ పనుల కోసం రూ.7.70 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా మంజూరు చేసింది. ఇదేరోజున సచివాలయం తరలింపుపై ఆర్‌అండ్‌బీ అధికారులతో సీఎం సమీక్ష జరపటం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ప్రస్తుత సచివాలయం దాదాపు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా, ఎర్రగడ్డ టీబీ ఆసుపత్రి 50 నుంచి 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ నేపథ్యంలో సచివాలయ సముదాయాన్ని ఎర్రగడ్డలో ఖాళీ చేయనున్న టీబీ ఆసుపత్రికి తరలించేందుకు గల సాధ్యాసాధ్యాలను ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలిసింది. కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లు ఎలా ఉండాలి.. అందులో ఎన్ని బ్లాక్‌లుండాలి.. ఎన్ని అంతస్తులుండాలి అనే వివరాలను సైతం సీఎం చర్చించినట్లు సమాచారం.
 
సీఎం ఆఫీసుకు ప్రత్యేక బ్లాక్...
తాజా ప్రతిపాదనల ప్రకారం కొత్త సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రత్యేకంగా ఒక బ్లాక్ కేటాయిస్తారు. ఏడు నుంచి ఎనిమిది అంతస్థుల భవనంలో సీఎం బ్లాక్ ఉంటుంది. మంత్రులకు సంబంధించి ఆరు నుంచి ఎనిమిది బ్లాక్‌లు నిర్మిస్తారు. ఒక్కో మంత్రికి రెండు అంతస్థులు కేటాయించాలనేది ప్రతిపాదన. మంత్రి కార్యాలయంతో పాటు ఆ విభాగపు కార్యదర్శి, ఉన్నతాధికారులు, విభాగపు సిబ్బంది అందులో ఉంటారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 17 మంది మంత్రులున్నారు. భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం మంత్రుల సంఖ్య దాదాపు 22 వరకు పెరగనుంది. వీరికి తోడు ఆరుగురు పార్లమెంటరీ కార్యదర్శులున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి రెండు అంతస్తుల చొప్పున మొత్తం 56 అంతస్తులు నిర్మించాల్సి ఉంటుంది. అందుకే ఏడు లేదా ఎనిమిది బ్లాక్‌లుగా బహుళ అంతస్తుల సముదాయం నిర్మించాలనేది తాజా ప్రతిపాదన. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలను 1888లో ఆరో నిజాం కాలంలో నిర్మించారు.

సైఫాబాద్ ప్యాలెస్‌గా అప్పట్లో ప్రసిద్ధి పొందిన ఈ భవనాలను ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పునర్నిర్మించారు. ఈ ప్రాంతం ‘హార్ట్ ఆఫ్ ది ట్విన్ సిటీస్’గా పేరొందిన నేపథ్యంలో ఇది అత్యంత ఖరీదైన స్థలం అనడంలో సందేహం లేదు. తొలి బడ్జెట్‌లోనే భూముల అమ్మకం ద్వారా దాదాపు రూ.6500 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలి ప్రయత్నంగా సెక్రటేరియట్‌ను తరలించేందుకు పావులు కదుపుతోంది.
 
బఫర్ జోన్ ఆంక్షల నేపథ్యంలో..
.
హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు నిర్మించి.. గ్రేటర్ సిటీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చెరువులు, కుంటల చుట్టూ బఫర్ జోన్‌లో పక్కా నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. హుస్సేన్‌సాగర్ చుట్టూ నిర్మాణాలకు సైతం ఇవే ఆంక్షలు వర్తించనున్నాయి. అందుకే బఫర్ జోన్‌కు అవతల ఉన్న సచివాలయ స్థలాలను విక్రయిస్తే, అక్కడ ఆకాశహర్మ్యాలు నిర్మించేందుకు మార్గం సుగమమవుతుందని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు