లౌకికవాద పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వాలి  

25 Mar, 2019 03:52 IST|Sakshi

ఆర్‌.సి. కుంతియా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 స్థానాల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తున్న తమకు లౌకికవాద పార్టీ లు మద్దతు పలకాలని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ జనసమితి, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలు కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం సహకరించాలని కోరారు. ఆదివారం గాంధీభవన్‌లో కుంతియా విలేకరులతో మాట్లాడారు. సామాజికన్యాయం కోసం తాము పోటీ చేస్తున్నామని, లౌకికవాద పార్టీలు పోటీలో లేని స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీకి ఓటమి భయం పట్టుకుందన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్‌ నేతృత్వంలో 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడాన్ని చూసి మోదీకే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. మాజీమంత్రి షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ కేటీఆర్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని, స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్‌ పార్టీయేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.  

కాంగ్రెస్‌ మనుగడ అగమ్యగోచరం  
మాజీఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌  
హైదరాబాద్‌: కాంగ్రెస్‌ అధినాయకత్వంలో విచక్షణ కరువైందని, ఆ పార్టీ మనుగడ అగమ్యగోచరంగా మారిందని అందుకే పార్టీ వీడుతున్నానని మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ అన్నారు. తాను ఏ పార్టీలో చేరతానో ఇప్పుడే చెప్పలేనన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ 1995లో తెలంగాణ ప్రత్యేక సాధన ఉద్యమంలో తాను కీలకపాత్ర పోషించానని, తర్వాత రాజ్యసభ సభ్యునిగా ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను పార్లమెంట్‌లో వినిపించానన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత సైద్ధాంతిక వైరుధ్యం తనను కలిచివేసిందన్నారు. అందుకే తాను కాంగ్రెస్‌ లోని అధినాయకత్వంతో విభేదించాల్సిన పరి స్థితి వచ్చిందన్నారు.  సబ్బండ జాతుల ప్రయోజనం, తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి, భారత జాతి సంరక్షణకోసం ప్రజలతో మమేకమయ్యేందుకు నిర్ణయించుకున్నట్లు వివరించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు