సికింద్రాబాద్‌ ‘హరిత’ స్టేషన్‌ 

12 Oct, 2017 02:32 IST|Sakshi

 దేశంలో తొలిసారిగా ఐజీబీసీ,సీఐఐల సిల్వర్‌ రేటింగ్‌ 

పర్యావరణ అనుకూల విధానాల అమలుతో ఘనత 

సాక్షి, హైదరాబాద్‌: చారిత్రక సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ మరో ఘనతను సొంతం చేసుకుంది. దేశంలోనే తొలి ‘హరిత రైల్వేస్టేషన్‌’గా ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్, భారత పరిశ్రమల సమాఖ్య (ఐజీబీసీ–సీఐఐ)ల గుర్తింపు పొందింది. దేశంలో ఈ తరహా గుర్తింపు విధానాన్ని ఈ ఏడాదే ప్రవేశపెట్టగా.. తొలిసారే సికింద్రాబాద్‌ స్టేషన్‌ దాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం. నిర్దేశిత ప్రామాణికాల ఆధారంగా సిల్వర్‌ రేటింగ్‌ సాధించి... దేశంలోనే ఉన్నత ప్రమాణాలతో కొనసాగుతున్న రైల్వేస్టేషన్లలో ఒకటిగా సికింద్రాబాద్‌ స్టేషన్‌ మరింత ఖ్యాతి పొందింది.

ఈ నెల 5న జైపూర్‌లో జరిగిన గ్రీన్‌ బిల్డింగ్‌ కాంగ్రెస్‌–2017లో ఈ గుర్తింపును ప్రకటించారు. రేటింగ్‌ నేపథ్యంలో అందజేసిన జ్ఞాపికను బుధవారం దక్షిణ మధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌కు చీఫ్‌ మెకానికల్‌ ఇంజనీర్‌ అర్జున్‌ ముండియా, సికింద్రాబాద్‌ డీఆర్‌ఎం అమిత్‌ వర్ధన్, ఏడీఆర్‌ఎం టమ్ట, స్టేషన్‌ డైరెక్టర్‌ వాసుదేవరెడ్డి తదితరులు చూపించారు. అధికారుల కృషిని జీఎం అభినందించారు. 

ఎందుకీ అవార్డు? 
కొంతకాలంగా సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అధికారులు పర్యావరణ అనుకూల చర్యలు ప్రారంభించారు. కేంద్రం ఇచ్చే ఆదేశాలను పాటించటంతోపాటు స్వతహాగా మరిన్ని ఆలోచనలను ఆచరణలో పెట్టారు. 

ఎన్నో రకాల చర్యలు.. 
13.34 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ముందువైపు వాహనాల రద్దీ, ఇరుకు రోడ్డుతో గందరగోళంగా ఉంటుంది. దానిని సొంతంగా సరిదిద్దలేని పరిస్థితి ఉండడంతో.. అధికారులు పదో నంబర్‌ ప్లాట్‌ఫారంవైపు ఉండే మార్గాన్ని పచ్చదనంతో తీర్చిదిద్దారు. సేంద్రియ ఎరువుల వినియోగంతో 408 రకాల మొక్కలు పెంచుతున్నారు. సౌర విద్యుత్‌ వినియోగం పరిధిలోకి 41.2 శాతం స్టేషన్‌ స్థలాన్ని తీసుకొచ్చారు. 2016లో 500 కిలోవాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి రోజుకు 2,500 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

ఫలితంగా ఏటా రూ.73 లక్షలు ఆదా అవుతున్నాయి. ఇక స్టేషన్‌లో పూర్తిగా ఎల్‌ఈడీ లైట్లను వినియోగిస్తున్నారు. నిత్యం 5 లక్షల లీటర్ల నీటిని పునర్వినియోగంలోకి తెచ్చేలా ప్లాంటును వాడుతున్నారు. తడి పొడి చెత్త విధానం, ప్లాస్టిక్‌ బాటిల్‌ క్రషింగ్‌ మిషన్‌ వినియోగం, కార్బన్‌ డయాక్సైడ్‌ సెన్సర్ల ఏర్పాటు, ఇంకుడు గుంతల వినియోగం తదితరాలు  స్టేషన్‌ ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.  

మరిన్ని వార్తలు