సికింద్రాబాద్‌–కరీంనగర్‌ రైల్వే లైన్‌కు శ్రీకారం!

4 Mar, 2017 03:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌–కరీంనగర్‌ రైల్వేలైన్‌ పనులు త్వరలో ప్రారంభంకాబోతున్నాయి. ఈ లైను ప్రారంభమయ్యే మనోహరాబాద్‌ నుంచి సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మధ్య 32 కిలోమీటర్ల తొలి దశ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచి నిర్మాణ సంస్థను ఖరారు చేసింది. మరో 15 రోజుల్లోనే ఇక్కడ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ రైల్వే లైన్‌కు సంబంధించి ఇప్పటికే పాత మెదక్‌ జిల్లా పరిధిలో భూసేకరణ పూర్తి కాగా.. పాత కరీంనగర్‌ జిల్లా పరిధిలో కసరత్తు సాగుతోంది. ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్రం ప్రాజెక్టుకు రూ.350 కోట్లు కేటాయించడం గమనార్హం. ఉమ్మడి భాగస్వామ్యం కాబట్టి రాష్ట్రం కూడా దానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది.

కోర్టు కేసుల రూపంలో అవాంతరం
ప్రాజెక్టు పరిధిలో మెరుగైన పరిహారం కో రుతూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వారు కేసులను వెనక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఆ దిశ గా సానుకూల పురోగతి ఉన్నట్టు రైల్వేకు సమాచారం అందడంతో చర్యలు చేపట్టింది.

ఇప్పుడు కొందరు నేతలు తమ భూములకు ఒక్కసారిగా ధర పెంచుకునేందుకు ఈ రైల్వే లైన్‌ను అవకా శంగా మలుచుకున్నారు. రైల్వేలైన్‌ తమ భూ ములకు చేరువగా నిర్మించేలా అలైన్‌మెంట్‌లో మార్పుచేర్పుల కోసం పైరవీలు ప్రారంభిం చినట్టు తెలిసింది. మార్గంలో స్వల్పంగా మార్పుచేర్పులు చేయటం ద్వారా తమ భూములకు చేరువగా రైల్వే లైన్‌ నిర్మాణం జరిగేలా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు రైల్వే శాఖపై కొందరు నేతలు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో అనువుగా లేని భూములను కూడా ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు