డబ్లింగ్‌తో తగ్గనున్న దూరభారం 

30 Nov, 2019 09:56 IST|Sakshi
రాజాపూర్‌ స్టేషన్‌లో నిర్మాణమవుతున్న నూతన భవనం

చురుగ్గా కొనసాగుతున్న రైల్వే డబ్లింగ్‌ లైన్‌ పనులు 

ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లు  

సాక్షి, మహబూబ్‌నగర్‌: సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలో మహబూబ్‌నగర్‌ స్టేషన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. మహబూబ్‌నగర్‌ స్టేషన్‌ నుంచి ప్రతినిత్యం 5వేల నుంచి 6వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. రై ల్వే క్రాసింగ్‌తో హైదరాబాద్‌ వెళ్లాలన్నా.. రా వాలన్నా గంటలతరబడి సమయం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు డబ్లింగ్‌ రైల్వే లైన్‌కు నిధులు కేటాయించాలని గత పదేళ్ల నుంచి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో నాలుగేళ్ల నుంచి కేంద్ర బడ్జెట్‌లో మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు అధికంగా నిధులు కేటాయిస్తున్నారు.  

బడ్జెట్‌లో డబ్లింగ్‌కు రూ.200 కోట్లు..  
దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్‌–మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు నాలుగేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించగా ఈ సారి బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ రైల్వేలైన్‌ పనులు జిల్లా పరిధిలో ముమ్మరంగా కొనసాగుతుంది. ఉందానగర్‌ నుంచి ప్రారంభమైన డబ్లింగ్‌ రైల్వే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్‌ చివర్లో లేదా జనవరి వరకు గొల్లపల్లి వరకు డబ్లింగ్‌లైన్‌ పూర్తయ్యేలా ముమ్మరంగా పనులు చేపడుతున్నారు. డబ్లింగ్‌లైన్‌లో భాగంగా విద్యుద్దీకరణ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. బాలానగర్, రాజాపూర్, గొల్లపల్లి రైల్వే స్టేషన్లలో నూతన భవనాల పనులకు శ్రీకారం చుట్టారు. గొల్లపల్లి స్టేషన్‌లో ఫ్‌లైవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. బాలానగర్‌ వాగుమీద రైల్వే వంతెన నిర్మిస్తున్నారు.

చురుగ్గా సాగుతున్న డబ్లింగ్‌లైన్, విద్యుద్దీకరణ పనులు  

డబ్లింగ్‌తో తగ్గనున్న దూరభారం..  
సికింద్రబాద్‌–మహబూబ్‌నగర్‌ రైల్వే డబ్లింగ్‌లైన్‌ పూర్తయితే జిల్లా ప్రయాణికులకు ఎంతో వెసులుబాటు లభిస్తుంది. మహబూబ్‌నగర్‌ నుంచి 100  కిలోమీటరు  దూరంలో  ఉన్న సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ప్యాసింజర్‌కు 3 గంటలు, ఎక్స్‌ప్రెస్‌కు 2.30 గంటల సమయం పడుతుంది. డబ్లింగ్‌ లైన్‌ పూర్తయితే ఒక గంట సమయం ఆదా అయ్యే పరిస్థితి ఉంది. వాణిజ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.

ప్రయాణికులకు సౌకర్యం 
ఈ ఏడాది బడ్జెట్‌లో మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు అధిక నిధులు కేటాయించారు. నిధులతో డబ్లింగ్‌ రైల్వే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. మరిన్ని నిధులు కేటాయించి డబ్లింగ్‌ లైన్‌ను త్వరితగతిన పూర్తిచేయాలి. డబ్లింగ్‌ లైన్‌ పనులు పూర్తయితే ప్రయాణికులకు ఎంతో సౌకర్యం లభిస్తుంది. క్రాసింగ్‌ ఉండవు. దీంతో గంటలోపే సికింద్రాబాద్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో ప్రయాణికులు సంఖ్య కూడా పెరుగుతుంది. సమయం ఆదా అవుతుంది. విద్యార్థులు, ఆస్పత్రులకు వెళ్లేవారికి వెసులుబాటులో ఉంటుంది. – ఎస్‌కే పీరాన్, రిటైర్డ్‌ సీనియర్‌ సీసీఐ  

మరిన్ని వార్తలు