కూ... చుక్‌చుక్‌ !

3 Feb, 2019 07:30 IST|Sakshi
మహబూబ్‌నగర్‌ – దివిటిపల్లి మధ్య సాగుతున్న డబ్లింగ్‌ లైన్‌ పనులు

పరుగులు తీయనున్న పాలమూరు రైల్వే ప్రాజెక్టులు

మహబూబ్‌నగర్‌: కేంద్రప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు ఆశాజనకంగానే నిధులు ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని రెండు ముఖ్యమైన ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించారు. మహబూబ్‌నగర్‌ – మునీరాబాద్‌ రైల్వే లైన్, సికింద్రాబాద్‌ – మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్లకు ప్రకటించిన నిధులపై ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈ పనులు ఇప్పటికే కొనసాగుతుండగా.. ఈసారి కేటాయించనున్న నిధులతో పనుల్లో వేగం పెరగనుందని భావిస్తున్నారు. అయితే, ఈసారి బడ్జెట్‌లో కూడా గద్వాల – మాచర్ల రైల్వే లైన్‌ ప్రస్తావన లేకపోవడం మాత్రం నిరాశకు గురిచేసిందనే చెప్పాలి. అలాగే, ఆదర్శ రైల్వేస్టేషన్ల ప్రకటన, ఎస్కటేటర్ల ఏర్పాటు, ఆర్వోబీల నిర్మాణంపై ప్రకటన చేయకపోవడం గమనార్హం.

మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ 
దాదాపు రూ.728 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన సికింద్రాబాద్‌ – మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు గత రెండేళ్ల నుంచి మెరుగైన నిధులు కేటాయిస్తున్నారు. గత ఏడాది బడ్జెట్‌లో రూ.250 కోట్లు కేటాయించగా ఈసారి కూడా రూ.200 కోట్లు కేటాయించారు. ఈ రైల్వేలైన్‌ పనులు జిల్లా పరిధిలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉందానగర్‌ నుంచి ప్రారంభమైన డబ్లింగ్‌ రైల్వే పనులు చకచకా జరుగుతున్నాయి. ప్రస్తుతం పనులు మహబూబ్‌నగర్‌ – దివిటిపల్లి మధ్య నడుస్తున్నాయి. తాజాగా కేటాయించిన నిధులతో పనుల్లో మరింత వేగం పెరుగుతుందని రైల్వే ప్రయాణీకులు భావిస్తున్నారు. మొత్తంగా ఏడాదిలోపు డబ్లింగ్‌ లైన్‌ పనులు పూర్తయ్యే అవకాశముందని చెబుతున్నారు.

తగ్గనున్న దూరాభారం 
సికింద్రాబాద్‌ – మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌ పనులు పూర్తయితే జిల్లా ప్రయాణికులకు వెసులుబాటు లభించనుంది. మహబూబ్‌నగర్‌ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సికింద్రాబాద్‌కు ప్యాసింజర్‌ రైలులోనైతే 3 గంటలు, ఎక్స్‌ప్రెస్‌లోనైతే 2.30 గంటల సమయం పడుతోంది. అదే డబ్లింగ్‌ లైన్‌ పనులు పూర్తయితే గంట పాటు సమయం ఆదా అయ్యే అవకాశముంది. ఇంకా వాణిజ్యపరంగా కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయని భావిస్తున్నారు.
 
మునీరాబాద్‌ లైన్‌ 
మహబూబ్‌నగర్‌ – మునీరాబాద్‌ రైల్వేలైన్‌ను 246 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. ఈ పనులకు 1997 – 98 బడ్జెట్‌లో ఆమోద ముద్ర లభించింది. రూ.645 కోట్ల వ్యయంతో ఈ రైల్వే పనులు చేపట్టగా తాజా బడ్జెట్‌లో రూ.275 కోట్లు కేటాయించారు. గత ఏడాది కూడా ఇంతేస్థాయిలో నిధులు కేటాయించడం విశేషం. ప్రస్తుతం ఈ పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జిల్లా పరిధిలో ఇప్పటివరకు 30 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. జిల్లాలోని కృష్ణాతోపాటు కర్నాటక రాష్ట్రం మునీరాబాద్‌ పరిధిలో పనులు పురోగతిలో ఉన్నాయి. అదే విధంగా జిల్లా రైల్వే పరిధిలోని ఆర్‌యూబీల నిర్మాణం కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
 
సర్వేలకే పరిమితం 
గద్వాల – మాచర్ల రైల్వేలైన్‌ నిర్మాణం కోసం దా దాపు మూడు దశాబ్దాలుగా అటు ప్రజాప్రతినిధు లు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇటు ప్రజలు ఏటే టా ఎదురుచూస్తూనే ఉన్నారు.కానీ ఇప్పటివరకు రైల్వేలైన్‌ నిర్మాణానికి ఆమోదమే లభించడం లేదు. దీని కోసం మూడు సార్లు సర్వే చేసినా రైల్వేలైన్‌ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం ఈ ప్రాంత ప్రయాణికులను ఆవేదనకు గురిచేస్తోంది. అలాగే, మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ను ఆదర్శ స్టేషన్‌గా మార్చాలన్న డిమాండ్‌ కూడా మిగిలిపోయిందనే విమర్శలున్నాయి.

అధిక నిధులు కేటాయించడం సంతోషం... 
ప్రస్తుత బడ్జెట్‌లో మునీరాబాద్‌– మహబూబ్‌నగర్‌ డబ్లింగ్‌ లైన్‌కు అధిక నిధులు కేటాయించడం సంతోషంగా ఉంది. ఈ నిధులతో లైన్ల నిర్మాణ పనులు మరింత చురుగ్గా జరిగే అవకాశం ఉంది. అలాగే, జిల్లా రైల్వేస్టేషన్‌లో లిఫ్ట్‌ ఎస్కలేటర్‌ ఏర్పాటు, జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట రైల్వే గేట్‌ వద్ద ఆర్‌ఓబీ నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలి. – మీర్జా జాకీర్‌బేగ్, రైల్వే కమ్యూటర్స్‌ ప్రతినిధి 

మహబూబ్‌నగర్‌ – దివిటిపల్లి మధ్య డబ్లింగ్‌ లైన్‌ నిర్మాణ పనులు 

మహబూబ్‌నగర్‌–మునీరాబాద్‌ రైల్వేలైన్‌  

మరిన్ని వార్తలు