యూఎస్‌ కాన్సులేట్‌కు భద్రత పెంపు

8 Jan, 2020 12:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇరాన్, అమెరికా దేశాల మధ్య దాడుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు బలగాలను మొహరించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా కాన్సులేట్ జనరల్ కార్యాలయం వద్ద భారీ భద్రత నేపథ్యంలో బేగంపేటలో ట్రాఫిక్‌కు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఉదయం ఆఫీసులు, విద్యాసంస్థలకు వెళ్లేవారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. రద్దీ సమయంలో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను ఎప్పటికప్పుడు నియంత్రించేందుకు నగర ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు చేపట్టారు. కాగా, మన దేశం సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై డిసెంబర్‌ 31న ఇరాన్‌ మద్దతున్న హిజ్బుల్‌ బ్రిగేడ్‌ తీవ్రవాద సంస్థ మద్దతుదారులు దాడికి పాల్పడటంతో చిచ్చు రగిలింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్‌ జనరల్‌ ఖాసీం సులేమానిని డ్రోన్ల సాయంతో క్షిపణి దాడులతో అమెరికా అంతమొందించింది. సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై తాజాగా ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. అమెరికా, ఇరాన్‌ పరస్పర దాడుల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

సంబంధిత వార్తలు..

అమెరికా స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు

నష్టాన్ని అంచనా వేస్తున్నాం: ట్రంప్‌

ఇరాన్‌ దాడి : భగ్గుమన్న చమురు

ట్రంప్‌–మోదీ ఫోన్‌ సంభాషణ

52తో పాటు.. 290 కూడా గుర్తుపెట్టుకో ట్రంప్‌!

సులేమానీ అంతిమయాత్రలో తొక్కిసలాట
 

మరిన్ని వార్తలు