ఆకాశంలో సగం.. భద్రత శూన్యం

31 Aug, 2016 02:23 IST|Sakshi
ఆకాశంలో సగం.. భద్రత శూన్యం

- మహిళలపై నేరాల్లో దేశంలో 8వ స్థానంలో తెలంగాణ
- రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడి
 
 సాక్షి, హైదరాబాద్: ఆమె ఆకాశంలో సగం.. అయినా ఆమెకు భద్రత శూన్యం.. రోడ్డుపైకి వెళితే పోకిరీలు.. ఇష్టం లేదన్నా వెంటపడే దుర్మార్గులు.. కన్నూమిన్నూ కానని కామాంధులు.. ఇంట్లో భర్త వేధింపులు.. పనిచేసే చోటా వదలని దుర్మార్గులు.. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలోనూ పెద్ద సంఖ్యలో ఈ తరహా ఘటనలు నమోదవుతున్నాయి. ఏడాదికేడాది మరింతగా పెరిగిపోతున్నాయి. 2015 సంవత్సరానికి సంబంధించి జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన నివేదిక ఈ అంశాలను వెల్లడించింది. మహిళలపై నేరాలకు సంబంధించి నమోదైన కేసుల్లో దేశం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం ఎనిమిదో స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. గతేడాది రాష్ట్రంలో మహిళలపై నేరాలకు సంబంధించి 15,135 కేసులు నమోదైనట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 3,27,394 కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. అందులో 31,126 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో నిలిచినట్లు పేర్కొంది. 28,165 కేసులతో రాజస్తాన్, 23,258 కేసులతో అస్సాం ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15,931 కేసులు నమోదయ్యాయి.

 పెరుగుతున్న అత్యాచార ఘటనలు
 రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల ఘటనలు ఏటికేడు పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2014లో 979 మంది అత్యాచారానికి గురికాగా.. 2015లో 1,105 మంది అత్యాచారానికి గురైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. అందులోనూ 18 ఏళ్లలోపు వయసున్న బాలికలపై అత్యాచారాలు అధికంగా నమోదవుతున్నాయని.. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. రాష్ట్రంలో గతేడాది 328 మంది బాలికలపై అత్యాచార ఘటనలు నమోదయ్యాయని తెలిపింది. ఇక మహిళలకు సంబంధించి 648 కిడ్నాప్ కేసులు నమోదవగా.. 676 మంది బాధితులున్నట్లు పేర్కొంది. గతేడాది దేశంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10,156 మంది మహిళలు కిడ్నాపైనట్లు వెల్లడించింది.
 
 వేధింపుల్లో ఏపీ నం.1
 మహిళలు పనిచేసే చోట అవమానం, వేధింపుల కేసుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో నిలవగా.. ఏపీ మొదటి స్థానంలో ఉన్నట్టు ఎన్‌సీఆర్‌బీ వెల్లడించింది. రాష్ట్రంలో 2014లో ఈ తరహా కేసులు 1,091 నమోదవగా.. 2015లో 1,291కి పెరిగింది. గతేడాది 7,329 మంది మహిళలు భర్త చేతిలో వేధింపులకు గురైనట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక వెల్లడించింది. ఇక 18 ఏళ్లలోపు బాలికలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గతేడాది 173 మంది బాలికలను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల రికార్డుల్లో నమోదైనట్టు నివేదిక పేర్కొంది.
 
 ఎన్‌సీఆర్‌బీ నివేదికలోని ముఖ్యాంశాలు..
► వివిధ రకాల నేరాలు, ఘటనలకు సంబంధించి గతేడాది తెలంగాణ పోలీసులకు 1,91,958 ఫిర్యాదులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు 2,39,926 ఫిర్యాదులు వచ్చాయి.
► తెలంగాణలో 1,188 హత్య కేసులు నమోదుకాగా 1,209 మంది హత్యకు గురయ్యారు. ఏపీలో 1,099 హత్య కేసులు నమోదుకాగా 1,144 మంది హత్యకు గురయ్యారు. హత్యల్లో తెలంగాణ 13వ, ఏపీ 14వ స్థానంలో నిలిచాయి.
► ఎస్సీ, ఎస్టీలపై నేరాలకు సంబంధించి 1,678 కేసులతో తెలంగాణ దేశంలో 10వ స్థానంలో నిలిచింది. 4,415 కేసులతో ఏపీ నాలుగో స్థానంలో ఉంది.
► 1,044 కిడ్నాప్ కేసులతో 17వ స్థానంలో తెలంగాణ, 917 కేసులతో 18వ స్థానంలో ఏపీ ఉన్నాయి.. తెలంగాణలో 14,765 దొం గతనాలు, 377 దోపిడీలు, 1,607 ఇళ్ల దొంగతనాలు జరిగాయి.
► అవినీతికి సంబంధించి తెలంగాణలో 193 కేసులు నమోదుకాగా, 107 మంది అరెస్టయ్యారు. పెండింగ్ కేసులు కలుపుకొని అవినీతి కేసుల సంఖ్య 408కు పెరిగింది. ఏపీలో 185 అవినీతి కేసులు నమోదుకాగా.. 177 మంది అరెస్టయ్యారు. మొత్తం అవినీతి కేసుల సంఖ్య 464కు పెరిగింది.

మరిన్ని వార్తలు