రైతులను ముంచడమే లక్ష్యంగా..

22 May, 2019 02:44 IST|Sakshi

లేబుల్స్‌ లేని విత్తనాలు అంటగడుతున్న దళారులు

ఇటు లేబుల్స్‌ను సైతం అక్రమంగా సంపాదిస్తున్న వైనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విత్తన దళారులు రైతులను దోచుకుంటున్నారు. అనేకచోట్ల నాసిరకపు విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. లేబుల్స్‌ లేకుండా విత్తన విక్రయాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల విత్తన ధ్రువీకరణ సంస్థ ద్వారా అంద జేసే లేబుళ్లనూ కొందరు అధికారులతో కుమ్మక్కై సంపాదిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా రైతులను మోసం చేసే పనిలో దళారులు, కొందరు ఏజెంట్లు నిమగ్నమయ్యారు. పైగా రాష్ట్రంలో విత్తన దుకా ణాల్లో సరైన రికార్డులు నిర్వహించడం లేదు. విత్తన ప్యాకెట్లకు అసలు లేబుల్స్‌ లేకుండా నేరుగానే రైతులకు అంటగడుతున్నారు. ఏ విత్తనం ఎక్కడిది.. ఎవరికి విక్రయిస్తున్నారు.. రోజువారీగా ఎంత అమ్ముతున్నారన్నది స్పష్టత లేదు. ప్యాకింగ్‌ లేని.. అనుమతి లేని పత్తి విత్తనాలు, నకిలీ విత్తనాలు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ఇటీవల జరిపిన నిఘా బృందాల తనిఖీలో బట్టబయలైంది. 

రూ.7.20 కోట్ల విలువైన పత్తి విత్తనాల సీజ్‌ 
వివిధ జిల్లాల్లో నిఘా బృందాలు విత్తన విక్రయ కేంద్రాలు, జిన్నింగ్‌ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీటిలో ఒక్కరోజే రూ.7.20 కోట్ల విలువ చేసే 16,499 కిలోల పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నిషేధిత గ్లైఫోసేట్‌ పురుగుమందు కూడా సీజ్‌ చేశారు. అనేక చోట్ల విత్తన దుకాణాల నిర్వహణ సరిగా లేకపోవడంతో పాటు నకిలీ, నాసిరకం విత్తనాలను రైతులకు అంటగడుతున్నట్లు తేలింది. ఖరీఫ్‌ దగ్గర పడుతుండటం తో దళారులు రైతులను మోసం చేస్తున్నారు. విత్తన చట్టాల్లోని లోపాలను ఆసరా చేసుకొని దళారులు, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 

ఖరీఫ్‌లో 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు... 
వచ్చే ఖరీఫ్‌లో 1.29 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. 90 కంపెనీల ద్వారా వీటిని రైతులకు సరఫరా చేయనుంది. జిల్లాల నుంచి వివిధ రకాల విత్తనాలకు ఇండెంట్‌ తెప్పించుకున్న ప్రకారం 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయనున్నారు. ఇందులో వరి విత్తనాలు 3 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయనున్నారు. హైబ్రిడ్‌ రకం, ఆర్‌ఎన్‌ఆర్‌–15064, కేఎన్‌ఎం–118, జేజీఎల్‌–18047 రకం విత్తనాలను సరఫరా చేస్తారు. వీటితోపాటు బీపీటీ–5204 రకం విత్తనాలనూ సరఫరా చేయాలని నిర్ణయించారు. 1.70 లక్షల క్వింటాళ్ల సోయాబీన్‌ విత్తనాలనూ సరఫరా చేయడంతోపాటు 20 వేల క్వింటాళ్ల కంది విత్తనాలను సరఫరా చేస్తారు. పెసర, మినుములు, జొన్న, మొక్కజొన్న, జీలుగ, పిల్లిపెసర, పొద్దు తిరుగుడు, ఆముదం విత్తనాలను ఖరీఫ్‌ కోసం అందజేస్తారు. లక్ష క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 80 వేల క్విం టాళ్ల మొక్కజొన్న విత్తనాలు సరఫరా చేస్తారు.

మరిన్ని వార్తలు