‘సీడింగ్’ మందకొడి

3 Jan, 2015 02:37 IST|Sakshi
‘సీడింగ్’ మందకొడి

వంట గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు బ్యాంకు ఖాతాల్లో నేరుగా సబ్సిడీ జమచేసే డీబీటీఎల్ పథకం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ప్రక్రియలో అత్యంత కీలకమైన బ్యాంకు ఖాతాల అనుసంధానం ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధానానికి మూడునెలలు గడువు ఇవ్వడం వినియోగదారులకు కొంత ఊరటనిస్తోంది. దీంతో డీబీటీఎల్ అమల్లో బ్యాంకర్ల పాత్ర కీలకం కానున్నది.
 
 సీడింగ్ పురోగతిలా!
 ఎల్‌పీజీ వినియోగదారులు        5,03,947
 అనుసంధానం చేసుకుంది        2,79,627
 బ్యాంకు ఖాతాల అనుసంధానం    1,61,369

 
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వంట గ్యాస్ వినియోగదారులకు మోడిఫైడ్ డైరక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ స్కీం (డీబీటీఎల్)ను కేంద్రం గత యేడాది ప్రకటించింది. నవంబర్ ఆరో తేదీ నుంచి తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అమల్లోకి తెచ్చింది. 2015 జనవరి నుంచి తెలంగాణలోని మిగతా జిల్లాల్లోనూ ఈ పథకా న్ని అమలు చేస్తామని ప్రకటించింది. వంటగ్యాస్ సిలిం డర్ వినియోగదారులకు (ఎల్‌పీజీ) సబ్సిడీ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

వినియోగదారులు సిలిండర్ పూర్తి ధరను చెల్లిస్తే, సబ్సిడీ మొత్తాన్ని తిరిగి వినియోగదారుడి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సబ్సిడీ పొందేందుకు గ్యాస్ కనెక్షన్ వివరాలతో ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను అనుసంధానం (సీడింగ్) చేయాలనే నిబంధన విధించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోనూ జనవరి ఒకటో తేదీ నుంచి డీబీటీఎల్ పథకం ప్రారంభమైంది.

అయితే ఇప్పటివరకు జిల్లాలో ఆధార్, బ్యాంకు ఖాతాల సీడింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కేవలం 32.02 శాతం వినియోగదారులు మాత్రమే గ్యాస్ కనెక్షన్ వివరాలతో బ్యాంకు ఖాతాల వివరాలను అనుసంధానించేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 55.49శాతం వినియోగదారులు కేవలం ఆధార్ కార్డు వివరాలు మాత్రమే సమర్పించారు.
 
మూడు నెలలు వెసులుబాటు
ఆధార్, బ్యాంకు ఖాతాల అనుసంధాన ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంతో మార్చి 31 వరకు గడువు పొడిగించారు. జిల్లాలో హిందుస్తాన్, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఏజెన్సీలు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. ఆయా కంపెనీలకు చెందిన గ్యాస్ ఏజెన్సీల వద్ద  వివరాల నమోదుకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినా స్పందన కనిపించడం లేదు.

మూడు నెలల్లో సీడింగ్ ప్రక్రియ పూర్తి చేసుకోని వారికి సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వినియోగదారుల నుంచి అందుతున్న సీడింగ్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు సంబంధిత బ్యాంకులకు సమర్పిస్తున్నాయి. అయితే పని ఒత్తిడి సాకుగా చూపుతూ బ్యాంకర్లు సీడింగ్ ప్రక్రియపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

‘సీడింగ్ కోసం గ్యాస్ ఏజెన్సీల నుంచి అందిన దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల కార్యాలయం ద్వారా ఎప్పటికప్పుడు బ్యాంకర్లకు అందజేస్తున్నారు. వినియోగదారులకు బ్యాంకు ఖాతాల సీడింగ్‌పై అవగాహన కల్పిం చేందుకు ఏజెన్సీలు కూడా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాయి. సీడింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇప్పటికే పలు దఫాలుగా గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు, బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించామని’ జిల్లా పౌర సరఫరాల అధికారి సయ్యద్ యాస్మిన్ వెల్లడించారు.

మరిన్ని వార్తలు