మద్య నిషేధాన్ని కోరుతూ దేశవ్యాప్త యాత్ర

30 Mar, 2015 00:29 IST|Sakshi
మద్య నిషేధాన్ని కోరుతూ దేశవ్యాప్త యాత్ర

ప్రముఖ సామాజిక ఉద్యమకర్త స్వామి అగ్నివేష్ వెల్లడి
 
హైదరాబాద్:  మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు దేశ వ్యాప్త యాత్రను చేపడుతున్నానని, దానికి కుల, మత, పార్టీలకు అతీతంగా సంపూర్ణ మద్దతు ఉన్నదని ప్రముఖ సామాజిక ఉద్యమ కర్త స్వామి అగ్నివేష్ తెలిపారు. ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆప్సా, మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల మద్య నియంత్రణ ఉద్యమ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన స్వామి అగ్నివేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ ‘కల్లు మానండోయ్ - కళ్లు తెరవండోయ్’ అని ఉద్యమాలు చేపడితే నేటి ప్రభుత్వాలు మాత్రం మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.

గుజరాత్‌లో మద్యం ఆదాయం లేకుండానే అభివృద్ధి పథంలో ఉందన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, రాజస్థాన్ ప్రభుత్వాలు గుర్తుంచుకోవాలన్నారు.  స్త్రీలపై అత్యాచారాలు.రోడ్డు ప్రమాదాలు, నేరాలతో పాటు అవినీతికి కూడా  మద్యమే కారణమన్నారు. మద్యం పరిశ్రమలకు ప్రభుత్వాలిచ్చే రుణాలు నిలిపేయాలన్నారు. సిగరెట్, పొగాకు, ఇతర మత్తు మందులనూ నిషేధించాలని డిమాండ్ చేశారు. గతంలో తాను తెలంగాణకు వచ్చినప్పుడు నేటి సీఎంతో మద్యాన్ని నిషేధించాలని కోరినప్పడు సరేనన్నారని, నేడు మాట తప్పుతున్నారని విమర్శించారు. కేసీఆర్ స్పృహలోకి వచ్చే విధంగా ఇక్కడ మద్య నిషేధ ఉద్యమాలు జరగాలని పిలుపునిచ్చారు. ఈ సభకు అధ్యక్షత వహించిన  జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఎక్సైజ్ పాలసీని రూపొందించాలన్నారు.

పీవోడబ్ల్యూ నేత వి. సంధ్య మాట్లాడుతూ జూన్1 నుంచి వస్తున్న ప్రభుత్వ సారాయిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల లోపు మద్యంపై ప్రభుత్వం నిర్ణయం చేయకుంటే ఆమరణ నిరహార దీక్ష చేపడతానని ఆటో వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటి చైర్మన్ అమానుల్లాఖాన్ హెచ్చరించారు. సభలో సీపీఐ (ఎం.ఎల్.) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్, అప్సా డెరైక్టర్ ఎస్. శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సంఘ నేతలు గజానని, శారద గౌడ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు