రాజుకుంటున్న ఎన్నికల సెగ

16 Nov, 2018 15:28 IST|Sakshi
వేములవాడ నియోజకవర్గం మ్యాప్‌ 

వేములవాడలో ఊపందుకున్న ఇంటింటికి ప్రచారం 

అసంతృప్తుల బుజ్జగింపులు పార్టీ శ్రేణులను కూడగడుతున్న వైనం  

ప్రముఖులను రప్పించేందుకు యత్నాలు  

రాజన్నా సిరిసీల్లా: వేములవాడ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరిగిపోయింది. నామినేషన్ల దాఖలు ప్రారంభం కావడంతో ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రమేశ్‌బాబు తన నామినేషన్‌ దాఖలు చేయగా, కాంగ్రెస్, మహాకూటమి అభ్యర్థి ఆది శ్రీనివాస్, బీజేపీ అభ్యర్థి రామకృష్ణ తమతమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచార వేగం పెంచేశారు. ఇప్పటికే ఓ దఫా నియోజకవర్గంలోని మేజర్‌ గ్రామాలను సందర్శించిన నాయకులు మలి దఫా ప్రచారం నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇంతేకాకుండా తమతమ ముఖ్యనాయకులను రప్పించి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్‌ వేసుకుంటున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ పార్టీ కేటీఆర్, హరీష్‌రావులతో బహిరంగ సభలు నిర్వహించారు.  

ఇంటింటికీ ప్రచారం... 
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు సిద్ధమైనప్పటి నుంచే ఆయా పార్టీల నాయకులు టికెట్లు వచ్చినా..  రాకున్నా... ఎవరికి వారుగా తమతమ ప్రచారాన్ని గ్రామగ్రామాన తిరగడం ప్రారంభించారు. కేసీఆర్‌ ముందస్తుగానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రమేశ్‌బాబుకు కేటాయించడంతో ఆయన తమ అనుచరగణంతో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుంచి ప్రతాప రామకృష్ణ సైతం ఇంటింటి ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటికి తిరుగుతూ అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరుతున్నారు.  

బుజ్జగింపుల పర్వం...
ఆయా పార్టీల్లో అలకలు, అసంతృప్తి వాదుల సంఖ్య రోజురోజుకు పెరుగుతునే ఉంది. దీంతో ఆయా పార్టీల అధినాయకత్వం వారిని బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో తుల ఉమ, ఎంపీపీ రంగు వెంకటేశ్‌తోపాటు వెయ్యి మంది సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ పార్టీ శ్రేణులు బుజ్జగింపులు ప్రారంభించారు. అయినప్పటికీ ఎంపీపీ రంగు వెంకటేశ్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీకీ రాజీనామా సమర్పించారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో తన అనుచరగణంతో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.  బీజేపీ మాత్రం నామినేషన్ల స్వీకరణ ఘట్టం ప్రారంభమయ్యేంత వరకు అభ్యర్థి ప్రకటించలేకపోయారు. అధికారికంగా ఇంకా ప్రకటనలు వెలువడకపోయినప్పటికీ తమకు అధిష్టానం నుంచి ఓకే చెప్పారని పేర్కొంటూ ప్రతాప రామకృష్ణ పార్టీ శ్రేణులతో కలసి సంబరాలు జరుపుకున్నారు.  

జంపింగ్‌ జపాంగ్‌లు  
ఎన్నికల సమయంలో తమ అనుభవం, ఓటు బ్యాంకును ప్రదర్శిస్తున్న గ్రామస్థాయి నాయకుల నుంచి మండల స్థాయి నాయకులు సైతం తమ ప్రాబల్యం చూపుకుంటూ ఆయా పార్టీల్లో చేరేందుకు సన్నద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నెల రోజులుగా కొనసాగుతున్న అంతర్గత విభేధాలు ఇక నుంచి తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమతమ పార్టీల్లోకి ఆహ్వానించుకుంటున్నారు.  

వేడెక్కిన వాతావరణం 
ఎన్నికల ఫీవర్‌ పెరిగింది. ఎక్కడ చూసినా రాజకీయ చర్చనే సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థులు ఊళ్లబాట పట్టారు. దీంతో ఊళ్లలో ఓట్ల పండుగ వాతావరణం పెరిగిపోయింది. ఇంతేకాకుండా గ్రామాల్లో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. డప్పు కళాకారులకు ఉపాధి పెరిగిపోయింది. ఊళ్లలోకి వచ్చే నాయకులకు ఘనస్వాగతం పలికేందుకు గ్రామీణులకు కాస్త ఉపాధి లభిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దీంతో రైతులకు కూలీల కొరత తీవ్రమైంది. 

మరిన్ని వార్తలు