10 సీట్లు ఖరారు

17 Mar, 2019 02:54 IST|Sakshi

తుది దశకు చేరిన టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక

పోటీకి సిద్ధంగా ఉండాలని 10 మందికి సమాచారం

పెండింగ్‌లో ఆరు లోక్‌సభ సెగ్మెంట్లు.. వాటిలో 4 సిట్టింగ్‌ స్థానాలు

ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

ఆశావహుల్లో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ప్రకటనను టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనే అంచనాతో జాబితా రూపొందిస్తోంది. రాష్ట్రంలో 16 లోక్‌సభ సెగ్మెంట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే పది స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. ‘ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి. నామినేషన్‌ దాఖలకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోండి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’అని టీఆర్‌ఎస్‌ అధిష్టానం పది స్థానాల్లోని ఆశావహులకు సమాచారం ఇచ్చింది. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితాలో నాలుగు టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సెగ్మెంట్లు ఉండటంతో ఆ ఎంపీల్లో ఆందోళన పెరుగుతోంది.

ఆయా సిట్టింగ్‌ ఎంపీలు, ఆశావహులు పరస్పరం ఫోన్లు చేసుకుంటూ ‘అన్నా ఆ సెగ్మెంట్‌పై అధిష్టానం స్పష్టత ఇచ్చిందట. మీకు సమాచారం వచ్చిందా? ఫోన్‌ వస్తే నాకు కచ్చితంగా చెప్పండి’అని చెప్పుకుంటున్నారు. పెండింగ్‌ సీట్లపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. కరీంనగర్‌ ఎన్నికల ప్రచార సభ తర్వాత లేదా మంగళవారం నిజామాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ తర్వాతే అభ్యర్థులపై స్పష్టత వస్తుందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ఇప్పటికే 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారంలోగా మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన ముందుగానే జరగవచ్చని తెలుస్తోంది. ఆరు లోక్‌సభ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారుపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్‌ స్థానాల్లోని అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ఈ సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను ఖరారు చేసి అన్ని సీట్లకూ ఒకేసారి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతున్నారు. 

►నల్లగొండ సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలోనే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ స్థానంలో తేరా చిన్నపరెడ్డి, వి. నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. 

►మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారుపై ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మాజీమంత్రి సి.లక్ష్మా రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. 

►ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు పొంగులేటి ప్రయత్నించారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనికితోడు ఈ సెగ్మెంట్‌లో ఖమ్మంలోని మరో కీలక సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దీంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్లను పరిశీలిస్తోంది. 

►మహబూబాబాద్‌ సెగ్మెంట్‌ అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌ అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ చివరి నిమిషంలో టికెట్‌ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్‌ పేర్లను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. 

►పెద్దపల్లి అభ్యర్థి ఖరారుపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఈ స్థానం ఉంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జి. వివేకానంద టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే వివేకానంద అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అన్నింటినీ పరిశీలించి నిర్ణయానికి రావా లని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నా రు. చివరి నిమిషంలో వివేకానందకు టికెట్‌ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

►సికింద్రాబాద్‌ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని టికెట్లను ఖరారు చేస్తున్నారు. తలసాని సాయికిరణ్‌ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, దండె విఠల్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. 

►టీఆర్‌ఎస్‌ అధిష్టానం పది స్థానాలపై స్పష్టతకు వచ్చింది. ఈ స్థానాల్లో అభ్యర్థులుగా ఉండే వారికి అనధికారికంగా సమాచారం ఇచ్చింది.

సమాచారం ఇచ్చిన స్థానాలు ఇవీ
ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ 
కరీంనగర్‌: బోయినపల్లి వినోద్‌ కుమార్‌ 
నిజామాబాద్‌: కల్వకుంట్ల కవిత 
జహీరాబాద్‌: భీంరావు బసంత్‌రావు పాటిల్‌ 
మెదక్‌: కొత్త ప్రభాకర్‌రెడ్డి 
భువనగిరి: బూర నర్సయ్యగౌడ్‌ 
వరంగల్‌: పసునూరి దయాకర్‌ 
చేవెళ్ల: జి. రంజిత్‌రెడ్డి 
మల్కాజిగిరి: కె. నవీన్‌రావు 
నాగర్‌ కర్నూల్‌: పి. రాములు  
 

మరిన్ని వార్తలు