వడ్డీ మాఫీ వట్టిదేనా!

3 Jun, 2020 11:32 IST|Sakshi
ఆదిలాబాద్‌ మండల సమాఖ్య కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్న ఎస్‌హెచ్‌జీ సభ్యులు

మహిళా సంఘాల్లో ఇప్పటికీ జమ కాని డబ్బులు

ఏడు నెలలుగా ఎదురుచూపులు

ఆందోళనలో స్వయం సహాయక సంఘాల సభ్యులు

ఆదిలాబాద్‌రూరల్‌: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం ఏటా బ్యాంకు లింకేజీ రుణాలను అందిస్తోంది. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించిన సంఘాలకు ప్రభుత్వం వడ్డీని తిరిగి ఇస్తోంది. 2019 నవంబర్‌లో బ్యాంకు లింకేజీ రుణాల వడ్డీని ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. వీటికి సంబంధించిన ఉత్తర్వులు సైతం జారీ చేసింది. మహిళలు రుణాలు సద్వినియోగం   చేసుకుంటూ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో వడ్డీలేని రుణ పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాని     నెలల తరబడి ప్రభుత్వం వడ్డీని విడుదల చేయకపోవడంతో రుణం పొందిన మహిళా సంఘా ల సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కొన్ని నెలలుగా పెండింగ్‌
జిల్లాలో కొన్ని నెలలుగా వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. దీంతో మహిళా సంఘాల సభ్యులు నిరాశతో ఉన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి క్రమం తప్పకుండా వడ్డీతో సహా వాయిదాలు చెల్లిస్తున్నారు. వాయిదాల చెల్లింపులో క్రమం తప్పితే వడ్డీ మినహాయింపు అవకాశం కోల్పోతారు. దీంతో బ్యాంకు లింకేజీ కింద పొందిన రుణాలకు మహిళా సంఘాల సభ్యులు క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ ప్రభుత్వం విడుదల చేయనున్న వడ్డీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత నవంబర్‌లో రూ.618 కోట్లు పెండింగ్‌లో ఉన్న రుణాలకు వడ్డీని విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాని ఈ నిధులు ఇంత వరకు రాలేదు. 

జమ కాని వడ్డీ
జిల్లాలో వడ్డీలేని రుణ పథకం కింద బ్యాంకుల నుంచి రుణాలు పొంది క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తున్న సంఘాలకు సంబంధించి వడ్డీని తిరిగి ప్రభుత్వం చెల్లిస్తోంది. వీటిని ఆయా సభ్యుల ఖాతాల్లో జమ చేస్తారు. జిల్లాలో గత ఆర్థిక సంవత్సరంలో రూ.107 కోట్లు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నా రూ.102 కోట్లు రుణాలు ఇచ్చారు. ఈ రుణాలు పొంది క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లిస్తూ వడ్డీలేని రుణ పథకానికి అర్హత సాధించిన అన్ని సంఘాల సభ్యులకు వడ్డీ జమ చేయాల్సి ఉంది.

రెండేళ్ల నుంచి ఎదురుచూపులు
రెండేళ్ల నుంచి వడ్డీ జమకాకపోవడంతో మ హిళా సంఘాలు ఇబ్బందులు పడుతున్నాయి. గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటనతో సంఘాల సభ్యులు ఎంతో సంబరపడ్డారు. వడ్డీ డబ్బుతో ప్రస్తుతం చేస్తున్న స్వయం ఉపాధి పనులను మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం కలుతుందని ఆశించారు. కాని ప్రభుత్వం ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వాటి ఊసేత్తకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన చెందుతున్నారు.  

బ్యాంక్‌ లింకేజీ రుణాల వడ్డీ ఇవ్వాలి
మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం బ్యాంక్‌ లింకేజీ ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అభినందనీయం. కాని వడ్డీని ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖాతాల్లో జమ చేస్తే బాగుంటుంది. దీంతో మహిళలు మరింత ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది.  – రాధ, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు, ఆదిలాబాద్‌రూరల్‌

రాగానే అందజేస్తాం
గత ఆర్థిక సంవత్సరంలో రూ.107 కోట్లు బ్యాంక్‌ లింకేజీ రుణాలు ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా రూ.102కోట్లు అందజేశాం. వడ్డీ లేని రుణాలకు నిధులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం వాస్తవమే. కాని ఇప్పటి వరకు ఈ నిధులు రాలేదు. రాగానే వారి ఖాతాల్లో జమ చేస్తాం.– రాజేశ్వర్‌ రాథోడ్, డీఆర్‌డీవో

మరిన్ని వార్తలు