పులితో సెల్ఫీ

10 Jun, 2015 01:47 IST|Sakshi
పులితో సెల్ఫీ

చాంద్రాయణగుట్ట (హైదరాబాద్) : జూ బోనులో ఉన్న పులిని వేధింపులకు గురి చేస్తూ ఫోటోలు దిగి ఫేస్‌బుక్‌లో పెట్టిన యువకుడిని బహదూర్‌పురా పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ మలక్‌పేట అక్బర్‌బాగ్ ప్రాంతానికి చెందిన అరీబ్ తహ మెహదీ(26) అనే యువకుడు ఈ నెల 6వ తేదీన బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్కుకు వెళ్లాడు. అక్కడ అతడు జూ ఉద్యోగి గోవింద్ సాయంతో సందర్శకులకు నిషిద్ధమైన డార్క్ రూంలోకి వెళ్లి బోనులో ఉన్న పులిని కాలు లాగుతూ హింసించాడు. హింసిస్తున్న ఫొటోలు, వీడియో తీసుకొని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ టైటిల్ కూడా ఇచ్చేశాడు.

అయితే దీనిని గమనించిన నెహ్రూ జూలాజికల్ అసిస్టెంట్ క్యూరేటర్ మోయినుద్దీన్ బహదూర్‌పురా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెహదీని అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. యువకుడిపై అక్రమ ప్రవేశం, వన్యప్రాణ రక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా మెహదీకి సహకరించిన గోవింద్‌ను జూ పార్కు అధికారులు సస్పెండ్ చేశారు. అతనిపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని సైతం త్వరలోనే అరెస్ట్ చేయనున్నారు.
 

మరిన్ని వార్తలు