తేలిన.. లెక్క! 

17 Feb, 2019 10:31 IST|Sakshi
మునుగోడు : పథకంపై జమస్థాన్‌పల్లి రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏఈఓ (ఫైల్‌)

సాక్షిప్రతినిధి, నల్లగొండ: రైతాంగానికి హెక్టార్‌కు రూ.6వేల పెట్టుబడి సాయం అందిస్తామని కేంద్రం చేసిన ప్రకటన జిల్లా రైతాంగంలో ఆనందం నింపుతోంది. ‘ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ పథకం కింద ఈసాయం అందివ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్లో ప్రకటించింది. దీనికి సంబంధించి విధివిధానాలు సిద్ధమవుతున్నాయని అధికార యంత్రాంగం చెబుతోంది. హెక్టారుకు రూ.6వేల ఆర్థిక సాయాన్ని మూడు విడతలుగా ఇవ్వనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకానికి సంబంధించి పూర్తిస్థాయి విధి విధానాలు తమకు అందలేదని, ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంలో ఈ మొత్తాన్ని మినహాయిస్తారా..? లేదా అన్న విషయంలో స్పష్టత కానరావడం లేదని చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకంతో ఏమాత్రం సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో ఆర్థిక సాయం మొత్తాన్ని జమ చేస్తామని కేంద్రం ప్రకటించిందని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో రాష్ట్రం ప్రభుత్వం అందించే సాయం, కేంద్రం కొత్తగా ప్రకటించిన సాయం వేర్వేరుగానే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమవుతాయని పేర్కొంటున్నారు. కాగా, జిల్లాలో ఐదు ఎకరాలలోపు ఎంతమంది రైతులు (ఖాతాలు) ఉన్నారు..? మొత్తంగా ఐదు ఎకరాలలోపు కమతాల్లో ఎంత విస్తీర్ణంలో సాగుభూమి ఉంది..? అన్న వివరాలను జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే సిద్ధం చేసింది.

ఆర్థిక సాయంగా రూ.295.60కోట్లు
ఇప్పటికిప్పుడు అందుబాటులో ఉన్న అధికారిక గణాంకాల మేరకు 6,80,915 ఎకరాల భూమి (5ఎకరాల లోపు) ఉంది. ఈ మొత్తం భూమి 3,46,442 రైతుల (ఖాతాలు) చేతుల్లో ఉంది. అయితే.. అధికారులు ఈ ఖాతాలను కూడా రెండు విభాగాలుగా విభజించారు. దీంతో రైతులకు అందనున్న ఆర్థిక సాయం కూడా వేర్వేరుగానే అందనుంది. ఒక ఎకరా నుంచి 2.46 ఎకరాల భూమి ఉన్న రైతులు 2,31,153 మంది ఉన్నారు. వీరి చేతిలో 2,77,947 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రూ.6వేల చొప్పున వీరికి రూ.75,80,38,390 ఆర్థిక సాయం అందనుంది. కాగా, 2.47 ఎకరాల నుంచి 4.93 ఎకరాల మధ్యలో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి 4,02,967 ఎకరాలు. ఈ భూమి 1,15,289 మంది రైతుల చేతుల్లో ఉంది.

ఈ మొత్తం భూమికి రూ.219,80,07,109 ఆర్థిక సాయం రైతులకు అందనుంది. అంటే.. ఒక ఎకరానుంచి 5 ఎకరాలలోపు ఉన్న 3,46,442 మంది రైతులకు ఏటా 295 కోట్ల 60 లక్షల 45వేల 499 రూపాయల సాయం అందనుందని చెబుతున్నారు. అయితే, పూర్తి లెక్కలు తేలాక అటు వ్యవసాయ భూమి, రైతుల సంఖ్యలో కొద్దిగా తేడాలు ఉండొచ్చని, దీంతో కేంద్రం నుంచి అందే  పెట్టుబడి సాయంలో కొంత వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకంలో ఏటా రూ.295.60కోట్ల దాకా రైతులకు పెట్టుబడి సాయంగా అందనుంది.

మరిన్ని వార్తలు