మిషన్‌ కాకతీయ’పై కథనాలు పంపండి

21 Dec, 2017 04:23 IST|Sakshi

చిన్న నీటిపారుదల శాఖ ఆహ్వానం.. జనవరి 31 చివరి తేదీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో జన జీవనంపై ‘మిషన్‌ కాకతీయ’ప్రభావంపై కథనాలు పంపాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే కోరారు. ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్‌ 31 వరకు పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచురితమైన, ప్రసారమైన కథనాలు ఎంట్రీలుగా స్వీకరిస్తామని బుధవారం తెలిపారు. వచ్చే జనవరి 31 వరకు పంపొచ్చన్నారు. పంటల దిగుబడులు, రసాయనిక ఎరువుల వాడకం, వలసలు, చెరువుల చరిత్రపై పరిశోధన, విశ్లేషణ, వ్యవసాయ కూలీలు, గ్రామీణ ఉపాధి కల్పన, ఫ్లోరోసిస్‌ నివారణ, భూగర్భజలాలు, ప్రజల సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రజల జీవన ప్రమాణాలు, సాంస్కృతిక విధానం వికాసం అంశాలపై పంపాలని తెలిపారు. వీటిని సచివాలయం ‘డి’బ్లాక్‌లోని ఓఎస్డీ కార్యాలయంలో ఇవ్వొచ్చని.. లేదంటే శ్రీధర్‌రావు దేశ్‌ పాండే, ఓఎస్డీ, ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్, డి బ్లాక్, గ్రౌండ్‌ ఫ్లోర్, సెక్రటేరియట్, హైదరాబాద్‌ అడ్రస్‌కు పంపాలని సూచించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్‌ మీడియా విభాగాల్లో మూడేసి చొప్పున బహుమతులు ఉంటాయని, మొదటి బహుమతి కింద రూ.లక్ష, రెండో బహుమతి కింద రూ.75 వేలు, మూడో బహుమతి కింద రూ.50 వేలు అందజేస్తారని తెలిపారు.

 ‘భగీరథ’ ఆలస్యంపై ఈఎన్‌సీ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ పనులు పూర్తిస్థాయిలో జరగడం లేదని ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సురేందర్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మిషన్‌ భగీరథ పనులను సమీక్షించారు. కొందరు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఆర్‌డబ్ల్యూఎస్‌ విభాగం విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విశ్వసనీయతకు భంగం కలిగించే ఏ వర్క్‌ ఏజెన్సీని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఓ వైపు డిసెంబర్‌ 31 వస్తున్నా కాంట్రాక్టర్లు ఇంకా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పైప్‌లైన్‌ గ్యాప్‌లను పూడ్చడం ద్వారా చాలా గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయవచ్చని, ఆ చిన్న పనులను కూడా ఏజెన్సీలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. డిసెంబర్‌ 31 నాటికి గ్రామాలకు శుద్ధిచేసిన తాగునీటిని అందించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఏజెన్సీలు తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కోదండపూర్‌ డబ్ల్యూటీపీలో ఎలక్ట్రో మెకానికల్‌ పనులు చేస్తున్న ఏజెన్సీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు