ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత

5 Mar, 2020 10:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ పాత్రికేయుడు, సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. ప్రముఖ పత్రికల్లో విధులు నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించిన పొత్తూరి వెంకటేశ్వరరావు.. పీవీ గురించి రాసిన ‘ఇయర్‌ ఆఫ్‌ పవర్‌’కు సహ రచయితగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. పొత్తూరి వెంకటేశ్వరరావు అంత్యక్రియలు సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో జరగనున్నాయి. కాగా పొత్తూరి వెంకటేశ్వరావు మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం
సీనియర్‌ జర్నలిస్టు పొత్తూరి వెంకటేశ్వర రావు మరణం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగు జర్నలిజంలో పొత్తూరి పాత్ర మరువరానిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. దశాబ్దాలుగా పత్రికా రంగానికి ఎనలేని సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వర రావు.. తెలుగు జర్నలిజంలో అందరికీ ఆదర్శప్రాయులు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌గా  పని చేసిన ఆయన.. ఎందరో పాత్రికేయులను తీర్చిదిద్దారని గుర్తు చేసుకున్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి: విజయసాయిరెడ్డి
ప్రముఖ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా... తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాల పాటు ఆయన అందించిన సేవలు మరువరానివని పేర్కొన్నారు. పొత్తూరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

మా గురువు ఆయన..
పొత్తూరి వెంకటేశ్వర్ రావు మా గురువు. పత్రికా స్వేచ్ఛ కోసం ఆయన ఎనలేని కృషి చేశారు. భావప్రకటన స్వేచ్ఛ కోసం నిబద్ధతగా పని చేశారు. ఎవరి ఒత్తిడికి తలొగ్గకుండా పత్రికలను నడపాలన్నారు. ప్రజలకు పత్రికలు సేవలందించాలని దృఢంగా కోరుకున్నారు. వృద్ధాప్యంలో కూడా అడవుల్లో నడిచి నక్సలైట్లతో చర్చలు జరిపారు - దేవుళపల్లి అమర్, సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు

పొత్తూరి మృతికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం
ప్రముఖ జర్నలిస్టు, ఆంధ్రప్రభ మాజీ సంపాదకుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతి పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ. జనార్ధనరెడ్డి మాట్లాడుతూ పొత్తూరి వెంకటేశ్వరరావు జర్నలిజానికి వెన్నెముక లాంటి వారన్నారు. ఆయన మరణం పాత్రికేయ లోకానికి తీరని లోటన్నారు. తెలుగు జర్నలిజం పెద్దదిక్కును కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలిపారు.

మరిన్ని వార్తలు