రెవెన్యూ అధికారుల నిర్వాకం;జర్నలిస్టు వినూత్న నిరసన

20 Aug, 2019 16:53 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌ : వారసత్వంగా తనకు వచ్చిన భూమిని వేరే వారికి ధారాదత్తం చేశారనే ఆవేదనతో ఓ సీనియర్‌ జర్నలిస్టు వినూత్న నిరసన చేపట్టారు. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ తన సొంత భూమిలో భుజాల వరకు మట్టిలో ఉంటూ 72 గంటల పాటు నిరసనకు దిగారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మారెడ్డి నాగేందర్‌ రెడ్డి గత 22 ఏళ్లుగా జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తనకు చెందిన భూమిని కొంతమంది అవినీతి అధికారులు ఏకపక్షంగా రికార్డులు ట్యాంపరింగ్‌ చేశారని ఆరోపిస్తూ మంగళవారం శాంతియుత దీక్షకు దిగారు. ఈ సందర్భంగా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో తమ తాతల నుంచి సంక్రమించిన భూమిని.. తమ ప్రమేయం లేకుండా అధికారులు ఇతరులకు ధారాధత్తం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ...‘ మా నాన్న మారెడ్డి అప్పిరెడ్డి చనిపోయిన తరువాత రెవిన్యూ రికార్డులను పరిశీలిస్తే....2012-13లో అక్రమంగా ఆర్వోఆర్ చేసినట్లు గుర్తించాను. ఏడాదిన్నర నుంచి పోరాటం చేస్తున్నాను. రెవెన్యూ అధికారుల ధన దాహనికి నాతో పాటు వందలాది మంది రైతులు దగా పడ్డారు. రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ ను ఆధారాలతో సహా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. ఎవరికి వారు ఉచిత సలహాలు ఇచ్చారు తప్ప రికార్డులను మార్చిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోలేదు. అవినీతి అధికారుల వలన రెండు సంవత్సరాల నుంచి రైతుబంధు పథకం ద్వారా లబ్ధిపొందలేకపోయాను. వారు మాత్రం కోట్ల రూపాయలు సంపాదించారు అని వాపోయారు.

విసిగిపోయాను అందుకే ఇలా..
‘నాకు జరిగిన అన్యాయంపై గళం విప్పాను. అయినా చర్యలు శూన్యం. నా 22 సంవత్సరాల మీడియా జీవితంలో ఎందరికో అండగా ఉన్నాను. అవినీతి అధికారుల భరతం పట్టాను. రెవెన్యూ, పోలీసు, రవాణాశాఖ, పంచాయతీరాజ్, విద్యాశాఖలో అధికారులను సస్పెండ్ చేయించాను. అయినా నాకు జరిగిన అన్యాయంపై చర్యలు లేవు. కలెక్టర్ ను కలిశాను. ఆర్డివో కోర్టులో అప్పీల్ చేసుకోమన్నారు. తప్పు రెవెన్యూ వాళ్లది అయితే... నేను ఎందుకు అప్పీల్‌కు వెళ్లాలి. ఎవరిని అడిగి రికార్డులను మార్చారు అంటే సమాధానం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రికార్డులను మార్చవచ్చా. ఎకరానికి రూ. 5 నుంచి 10 వేలు తీసుకుని రికార్డులను ఇష్టానుసారంగా మార్చారు. అవినీతికి పాల్పడిన వీఆర్వో రాంబాబు, ఆర్.ఐ లక్ష్మణ్, తహశీల్దారు విజయ్ కుమార్ మీద పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాను. అయినా చర్యలు శూన్యం. వ్యవస్థ మీద విసిగిపోయాను. అందుకే ఇలా శాంతియుత దీక్షకు దిగాను ’ అని మారెడ్డి నాగేందర్‌రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ తనకు అండగా నిలవాలని కోరారు.

మరిన్ని వార్తలు