పార్శిల్స్‌ ఘటనపై స్పందించిన పోస్టల్‌ శాఖ

21 Aug, 2019 17:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ పోస్టాఫీస్‌కు వచ్చిన పలు పార్శిల్స్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు అధికారుల పేరిట పార్శిల్స్‌ రావడం అధికారులను పరుగులు పెట్టించింది. తాజాగా ఈ ఘటనపై సికింద్రాబాద్‌ సీనియర్‌ పోస్ట్‌ మాస్టర్‌ రమణారెడ్డి స్పందించారు. ‘మాకు శనివారం సాయంత్రం పార్శిల్స్‌ వచ్చాయి. ఆఫీస్‌ టైమ్‌ అయిపోవడంతో వాటిని తిరిగి పంపించాం. మంగళవారం ఉదయం మళ్లీ పోస్ట్‌ చేయడానికి తీసుకొచ్చారు. అయితే పార్శిల్స్‌ నుంచి చెడు వాసన వచ్చింది. ఆ పార్శిల్స్‌ ఉస్మానియా యూనివర్సిటీ ఫ్రొఫెసర్‌ల నుంచి పోస్టు చేసినట్టు తెలిసింది. దీంతో మేము వారి నుంచి సమాచారం కోరాం. వారు తాము ఎలాంటి పార్శిల్స్‌ పంపలేదని తెలిపారు. తమను ఇబ్బంది పెట్టడానికి ఎవరో ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని వారు వివరణ ఇచ్చారు. తొలుత అందులో కెమికల్స్‌ ఉన్నాయని భావించినప్పటికీ.. అది మురుగు నీరు అని తేలింది. ఆ పార్శిల్స్‌తోపాటు మూడు పేజీల లేఖ కూడా ఉంది. దానిని పోలీసులు స్వాధీనం చేసుకున్నార’ని రమణారెడ్డి తెలిపారు. 

కాగా, ఆ పార్శిల్స్‌ ఓయూ నుంచి ప్రధాన పోస్టాఫీస్‌కు వచ్చాయని అధికారులు గుర్తించారు. అందులో మురుగు నీరు ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న మురుగు నీటి సమస్యను ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు వర్సిటీ విద్యార్థులే ఇలా పార్శిల్స్‌ పంపించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  

మరిన్ని వార్తలు