ఫొటోలు మార్పింగ్ చేసి.. ఫేస్‌బుక్‌లో పెట్టి

22 Dec, 2014 23:54 IST|Sakshi
ఫొటోలు మార్పింగ్ చేసి.. ఫేస్‌బుక్‌లో పెట్టి

* విద్యార్థినిని డబ్బు డిమాండ్ చేసిన ‘సీనియర్’
  
*   నిందితుడి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: జూనియర్ విద్యార్థిని ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియా (ఫేస్‌బుక్)లో అప్‌లోడ్ ఓ సీనియర్ విద్యార్థి వేధింపులకు పాల్పడ్డాడు. వాటిని తొలగించాలంటే తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని   సైబరాబాద్ పోలీసులు సోమవారం కటకటాల్లోకి నెట్టారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం కథనం ప్రకారం...  హయత్‌నగర్‌కు చెందిన యువకుడు ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తనకు జూనియర్ అయిన ఓ విద్యార్థిని ఫేస్‌బుక్ ఐడీ, పాస్‌వర్డ్ దొంగచాటుగా తెలుసుకున్నాడు.

ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీల చిత్రాలుగా మార్చి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. వాటిని తొలగించాలంటే తనకు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్ నిందితుడిన్న గుర్తించి సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

ఇతని వద్ద లాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న అశ్లీల చిత్రాలను తొలగించారు.  ఈ విధంగా ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే బాధితులు తమకు ఫిర్యాదు చేస్తే నిందితులను కఠినంగా శిక్షిస్తామని సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బాధితుల పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు