ఫేస్‌బుక్‌లో కామెంట్‌ పెట్టాడని విద్యార్థిపై దాడి 

25 Jul, 2019 07:34 IST|Sakshi
శివగణేష్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్‌

వీడియోతీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేసిన నిందితులు  

వైరల్‌ కావడంతో పోలీసులకు కళాశాల అధ్యాపకుల ఫిర్యాదు

సత్తుపల్లి: జూనియర్‌ విద్యార్థిపై సీనియర్ల దాడి కలకలం సృష్టించింది. ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేశాడని జూనియర్‌ను లాక్కెళ్లి పాడుబడిన ఇంట్లో చితక బాదిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సోమవారం దాడి చేసి, సెల్‌ఫోన్‌లో వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. మంగళవారం వీడియో వైరల్‌గా మారింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కనకళ్ల గ్రామానికి చెందిన వలకట్ల శివగణేష్‌ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కొత్తూరు మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాలలో అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.

నెల రోజుల క్రితం తన మిత్రుడనుకుని ఎస్‌కె అఫ్రీద్‌ను ఫేస్‌బుక్‌ మెసెంజర్‌లో చిన్న కామెంట్‌ చేశాడు.దీనిపై అఫ్రీద్, శివగణేష్‌ తీవ్రపదజాలంతో చాటింగ్‌ చేసుకున్నారు. తర్వాత తనమిత్రుడు అఫ్రీద్, ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేసిన అఫ్రీద్‌ ఒక్కరుకారని తెలుసుకున్న శివగణేష్‌.. ఎస్‌కె అఫ్రీద్‌కు క్షమించమంటూ మళ్లీ పోస్టు చేశాడు. అయినా కనికరించకుండా శివగణేష్‌పై దాడి చేశారు. దాడి చేసిన ఎస్‌కె అఫ్రీద్‌(అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి), ఎస్‌.సాయికిరణ్‌(ఖమ్మం), వి.మణితేజ(సత్తుపల్లి మండలం రేజర్ల) అదే కళాశాలలో డిప్లొమా ట్రిపుల్‌ఈ మూడో సంవత్సరం చదువుతున్నారు.  

పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి దాడి
పెద్దపల్లి నుంచి వి.శివగణేష్‌ కళాశాలకు వెళ్లేందుకు సోమవారం సాయంత్రం సత్తుపల్లి వచ్చాడు. ఆలస్యం కావటంతో బయట మిత్రుని గదిలోనే ఉన్నాడు. అదేరోజు శివగణేష్‌ బయట కన్పించటంతో ఎస్‌కె అఫ్రీద్‌ మిత్రులైన ఎస్‌.సాయికిరణ్, వి.మణితేజలతో పాటు మరికొంత మందితో కలిసి శివగణేష్‌ నోరుమూసి కళాశాల సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి విచక్షణా రహితంగా కొట్టారు. ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేశారు. శివగణేష్‌ ఆర్తనాదాలు చేస్తున్నా వదలకుండా.. దుర్భాషలాడుతూ కాళ్లు, చేతులు, కర్రలతో ఇష్టం వచ్చినట్టు.. ఈడ్చి.. ఈడ్చి.. కొట్టడం చూపరులను కలిచివేస్తోంది. ఈ వీడియో దృశ్యాలు కళాశాల వాట్సాప్‌ గ్రూపుల్లో, ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారి విషయం బహిర్గతమైంది.

 పోలీసులకు ఫిర్యాదు.. 
శివగణేష్‌పై  సీనియర్‌ విద్యార్థుల దాడి చేసిన  విషయం మదర్‌థెరిస్సా ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ చలసాని హరికృష్ణకు మంగళవారం సాయంత్రం తెలిసింది. బాధిత విద్యార్థి శివగణేష్‌ నుంచి వివరాల తెలుసుకుని దాడిచేసిన విద్యార్థులైన ఎస్‌కె అఫ్రీద్, వి.మణితేజ, ఎస్‌.సాయికిరణ్‌లను విచారించి, వీడియో క్లిప్‌ను జత చేసి కళాశాలకు చెందిన అధ్యాపకులు, సిబ్బందితో సత్తుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు పంపించటంతో దాడి ఘటన వెలుగు చూసింది. పెద్దపల్లిలో ఉన్న తల్లిదండ్రులకు కళాశాల సిబ్బంది ఫోన్‌ చేసి చెప్పటంతో విషయం తెలిసిందని బాధితుని తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. సీనియర్‌ విద్యార్థులు దాడి చేసిన విషయాన్ని శివగణేష్‌ తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు. మళ్లీ ఎక్కడ దాడి చేస్తారోనని భయంతో చెప్పలేదని కనీళ్ల పర్యంతమయ్యాడు.  

దాడి ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ 
జూనియర్‌ విద్యార్థిపై సీనియర్‌ విద్యార్థులు దాడి చేసిన ఘటనా స్థలాన్ని సత్తుపల్లి పట్టణ సీఐ సురేష్‌ బుధవారం సందర్శించారు. దాడికి వాడిన కర్రలను స్వాధీనం చేసుకున్నారు. ఏదైన మత్తు పదార్థం తీసుకొని దాడికి పాల్పడ్డారేమోనని క్షుణ్ణంగా పరిశీలన చేశారు. కళాశాలలో ఘటనను చూసిన విద్యార్థులను పిలిచి ఎలా జరిగిందో విచారించారు. శివగణేష్‌ను వైద్య పరీక్షల నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు శివగణేష్‌ శరీరంపై ఉన్న గాయాలను పరీక్షించారు. విచారణ నిర్వహిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిపై ర్యాగింగ్‌ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేస్తామని సీఐ టి.సురేష్‌ తెలిపారు.               

>
మరిన్ని వార్తలు