అభ్యంతరాలన్నీ పరిశీలించాకే మున్సి‘పోల్స్‌’

28 Aug, 2019 03:03 IST|Sakshi

హైకోర్టులో కాంగ్రెస్, బీజేపీ ఎంపీల వేర్వేరు అఫిడవిట్లు

సాక్షి, హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల వివాదం లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా జరిగిందంటూ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముగ్గురు లోక్‌సభ సభ్యులు హైకోర్టులో అఫిడవిట్లను దాఖలు చేశారు. అభ్యంతరాలన్నింటినీ చట్ట నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాకే మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని, అప్పటివరకూ ఎన్నికలను నిర్వహించరాదంటూ కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎంపీ బండి సంజయ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికలు జరగాల్సిన 123 మున్సిపాలిటీల్లో ఇప్పటికే సింగిల్‌ జడ్జి 50 మున్సిపాలిటీల ఎన్నికలను నిలుపుదల చేస్తూ స్టే ఉత్తర్వులిచ్చారని, ఎన్నికల ముందస్తు ప్రక్రియ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా చేశారని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల ముందస్తు ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని పేర్కొంటూ నిర్మల్‌ జిల్లాకు చెందిన అంజుకుమార్‌రెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రభు త్వం దాఖలు చేసిన కౌంటర్‌లోని విషయాలు వాస్తవంకాదని ఆ ముగ్గురు ఎంపీలు తమ∙అఫిడవిట్లల్లో పేర్కొన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా జరిగిన ముందస్తు ఎన్నికల ప్రక్రియను సరిచేశాకే ఎన్నికలు జరిగేలా ఉత్తర్వులివ్వాలని కోరారు. ‘మున్సిపల్‌ ఎన్నికల గడువు తగ్గించడం చట్ట వ్యతిరేకం. హైకోర్టుకు తెలిపిన సమాచారానికి విరుద్ధంగా చేసింది. ఈ చర్యల్ని ప్రభుత్వం కౌంటర్‌లో సమర్థించుకోవడం సరికాదు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల్ని సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్లు సేకరించారనడం అవాస్తవం. దీనికి సంబంధించిన ఆధారాలు హైకోర్టు తెప్పించుకుంటే అసలు గుట్టు రట్టవుతుంది. 1,373 అభ్యంతరాలు ఎక్కడ వచ్చాయో వాటిని ఏవిధంగా పరిష్కరించారో వివరాల్ని ప్రభుత్వం చెప్పలేదు’ అని ఎంపీలు తమ అఫిడవిట్లల్లో పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు