ఓబీసీలను ఐదు గ్రూపులుగా విభజించండి

31 May, 2018 03:26 IST|Sakshi

జస్టిస్‌ రోహిణిని కోరిన బీసీ సంఘం నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ కులాలను ఐదు గ్రూపులుగా విభజించి, గ్రూపుల వారీగా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ కులాల వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రోహిణిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య, ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, భూపేశ్‌ సాగర్‌ బుధవారం ఢిల్లీలో జస్టిస్‌ రోహిణిని కలసి ఈ మేరకు వినతిపత్రాన్ని ఇచ్చారు. వర్గీకరణ శాస్త్రీయంగా సమన్యాయం జరిగేలా చేయాలని, ఒక్కో రాష్ట్రాన్ని యూనిట్‌గా పరిగణించి ఓబీసీల స్థితిగతులను విశ్లేషించాలని నేతలు కోరారు.

2011 జనాభా లెక్కల్లో కులాల వారీగా లెక్కలు సేకరించారని, కేంద్రం వీటిని ప్రకటిస్తే గ్రూపుల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడానికి వీలవుతుందన్నారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటామని జస్టిస్‌ రోహిణి హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ గంగారాంతో సమావేశమైన నేతలు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదింపజేయాలని కోరారు.

మరిన్ని వార్తలు