శక్తివంచన లేకుండా సేవ చేశా..

26 Nov, 2018 11:39 IST|Sakshi

ఇంకా చేయాల్సింది చాలా ఉంది

నియోజకవర్గంలో రూ.800 కోట్లతో అభివృద్ధి చేసిన పనులే గెలిపిస్తాయి  

శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాను 

ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు.

‘సాక్షి’ఇంటర్వ్యూలో భువనగిరి అసెంబ్లీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి

సాక్షి, యాదాద్రి : నియోజకవర్గ ప్రజలకు సాగు, తాగునీరు, ఉపాధి అవకాశాల కల్పనకు పెద్దపీట వేశాను. తొలిసారిగి ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు శక్తి వంచన లేకుండా సేవ చేశాను.శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యతనిచ్చాను.

ఇప్పుడు ప్రజలందరూ ప్రశాంతంగా ఉన్నారు. సుమారు రూ.800 కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అధినేత కేసీఆర్‌ మెప్పు పొందగలిగిన నేను ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తాను.

నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతోపాటు, సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని అంటున్నారు.. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అ భ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన పలు విషయాలు వెల్లడించారు.


సాక్షి : ఎన్నికల్లో మీకు కలిసొస్చే అంశం ఏది?
పైళ్ల శేఖర్‌రెడ్డి : ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే నన్ను మరోసారి గెలిపిస్తాయి. నియోజవకవర్గంలో ఎన్నడూ జరగని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం లో చేసి చూపించాం. అసరా ఫించన్లు, ఆరోగ్యశ్రీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, గొర్రెల పంపిణీ, కేసీఆర్‌ కిట్‌ల కోసం రూ.99.63 కోట్లకుపైగా ఖర్చుచేశాం.

గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మించాం. హెచ్‌ఎండీఏ, నియోజకవర్గ అభివృద్ధి నిధులు, మిషన్‌ కాకతీయ, ఉపాధిహామీ పథకం ద్వారా రూ.30 కోట్ల పనులు నిర్వహించాం. హెచ్‌ఎండీఏ నుంచి వచ్చిన రూ.60 కోట్ల నిధులతో భువనగిరి, బీబీనగర్, పోచంపల్లి మండలాల్లోని గ్రామాల్లో సీసీ రోడ్ల పనులను ఎన్నికలకు ముందే చేపట్టాం.

రైతాంగానికి సాగు నీరందించేందకు చేపట్టిన గందమల్ల, బస్వాపురం రిజర్వాయర్ల పనులు చురు గ్గా సాగుతున్నాయి. బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల ద్వారా నియోజకవర్గంలో సాగు విస్తీర్ణం పెంచాం. ఇందుకోసం సీఎం కేసీఆర్‌ రూ. 284 కోట్లు మంజూరు చేశారు. పనులు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతల విషయంలో నిక్చి్చగా వ్యవహరించాం.

ఎమ్మెల్యే అయ్యేనాటికి భువగగిరిలో ప్రజలు  భయంతో బతికేవారు. ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేశాను.  ఇప్పుడు ప్రశాతంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే.


సాక్షి : మళ్లీ  గెలిస్తే ఏయే రంగాలకు ప్రాధాన్యత ఇస్తారు?
పైళ్ల శేఖర్‌రెడ్డి : ఇప్పటికే రూ.800కోట్లతో అభివృద్ధి పనులు చేశాను. ఇంచా చేయాల్సి ఉన్నందున రెండో సారి ఎమ్మెల్యేగా గెలిపించమని కోరుతున్నాను. గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. విద్య, వైద్యం, ఉపాది, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తా. కొన్ని రహదారులను విస్తరించాల్సి ఉంది. అత్యంత ప్రమాదకరంగా ఉన్న మూసీ నదిపై బ్రిడ్జిలను నిర్మిస్తున్నాం.

భువనగిరి పట్టణం మొత్తం అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ ఏర్పాటు చేస్తాం. అర్బన్‌ కాలనీ ప్రజలకు గేట్‌ సమస్య పరిష్కరించడానికి ఆర్‌ఓబీ నిర్మాణం చేయిస్తాను. వీటితో పాటు భువనగిరి పట్టణాన్ని  సుందరంగా తీర్చిదిద్దుతాం. పోచంపల్లి మున్సిపాలీటిని అభివృద్ధి చేస్తాం. 


సాక్షి : అభివృద్ధిప ఇంకా ఎలా ఉండబోతుంది?
పైళ్ల శేఖర్‌రెడ్డి : అవుటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)–భద్రాద్రి జాతీయ రహదారిని పోచంపల్లి మీదుగా వెళ్లేందుకు అలైన్‌మెంట్‌ మార్చాం. ఈ రహదారితో ఎవరూ ఊహించని విధంగా పోచంపల్లి అభివృద్ధి చెంది రూపురేఖలే మారిపోతాయి. బీబీనగర్‌ పట్టణం శరవేగంతో అభివృద్ధి చెందుతుంది. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ పూర్తి కావడంతో నే ఆ ప్రాంతం పర్యాటక రంగం పురోగతి చెందుతుంది.

భువనగిరి ఖిలా పర్యాటక కేంద్రంగా రూ పుదిద్దుకుంటోంది. భూదాన్‌పోచంపల్లి, భువనగిరి ప్రాంతాలు కలిపి పర్యాటక సర్క్యూట్‌గా మా రబోతున్నాయి. కేసీఆర్‌ మళ్లీ సీఎం అయితే భువనగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత పురోగతి సాధిస్తుంది.  


సాక్షి : మూసీ ప్రక్షాళన ఎంత వరకు వచ్చింది?  
పైళ్ల శేఖర్‌రెడ్డి : ప్రభుత్వం ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్‌ భువనగిరి సభలో నియోజకవర్గ ప్రజలకు మూసీ ప్రక్షాళనపై హామీ ఇచ్చారు. రెండేళ్లలో పూర్తవుతుంది.    


సాక్షి : సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా?
పైళ్ల శేఖర్‌రెడ్డి : నియోజకవర్గంలో పీఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపట్టాను. కాలుష్యం, ఫ్లోరిన్‌ సమస్య పరిష్కారానికి గ్రామాల్లో ఫౌండేషన్‌ ద్వారా బోర్లు వేయించి పంçపు సెట్లు, మోటార్లు బిగించాం. ఏటీడబ్ల్యూ మిషన్లు, వాటర్‌ ఫిల్టర్లు ఏర్పాటు చేయించాను. వాటర్‌ క్యాన్లు, డస్ట్‌బిన్‌లు, ఎల్‌ఈడీలైట్‌లు పంపిణీ చేశాం. పలువురికి ఆర్థిక సహాయం అందజేశాను.    

మరిన్ని వార్తలు