అక్రమ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసిన ‘సెర్ప్‌’

10 Jun, 2020 10:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆసరా వృద్ధాప్య పింఛన్లలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. నిబంధనలకు విరుద్ధంగా 14,975 మంది పింఛన్లను కాజేసినట్లు తేలింది. పండుటాకులకు ఆపన్నహస్తం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో దంపతుల్లో ఒకరు మాత్రమే పింఛన్‌కు అర్హులు కాగా, అధికారుల కళ్లుగప్పి ఇరువురు పింఛన్‌ పొందుతున్నట్లు అంతర్గత విచారణలో పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) తేల్చింది. ఈ మేరకు మే నెలకు సంబంధించి దాదాపు 30 వేల (దంపతుల) మంది పింఛన్లను నిలిపివేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇన్నాళ్లూ పొందిన పింఛన్‌ సొమ్మును రికవరీ కూడా చేయాలని నిర్ణయించింది. అక్రమంగా పింఛన్‌ తీసుకున్నవారి జాబితాను తయారుచేసి మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు, మున్సిపల్‌ కమిçషనర్లకు పంపింది. లబ్ధిదారుల జాబితాను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి అర్హులు/అనర్హుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించింది.

ఈ నివేదిక అనంతరం అర్హులుగా తేలితే వారి పింఛన్‌ను విడుదల చేయాలని, అనర్హులుగా గుర్తిస్తే సొమ్మును రికవరీ చేయాలని స్పష్టం చేసింది. సామాజిక భద్రత చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, గీత కార్మికులు, ఫైలేరియా, ఎయిడ్స్‌ బాధితులకు రూ.2,016, వికలాంగులకు ప్రతి నెలా రూ.3,016 పింఛన్‌ను అందజేస్తోంది. అయితే ఈ పథకానికి కుటుంబసభ్యుల్లో ఒకరు మాత్రమే అర్హులు కాగా.. చాలాచోట్ల భార్యాభర్తలు లబ్ధి పొందుతున్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన సెర్ప్‌ యంత్రాంగం జాబితాను తయారు చేసింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 1,766, నల్లగొండ 763, మంచిర్యాల 756, కరీంనగర్‌ 674, రంగారెడ్డి 643, జగిత్యాల 626, నారాయణపేట 623, మేడ్చల్‌ 585, ఖమ్మం 558, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 546 మంది ఉన్నారు. ఈ మేరకు మే నెలకు సంబంధించి డబుల్‌ పింఛన్లను ఆపేసింది. 

ప్రభుత్వోద్యోగుల కుటుంబాలకు కూడా.. 
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులెవరైనా వృద్ధాప్య పింఛన్‌ తీసుకున్నట్లు తేలితే తక్షణమే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగి ఉన్న కుటుంబసభ్యులు పింఛన్‌ పొందేందుకు అనర్హులు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేయడంతో నెలానెలా వచ్చే పింఛన్‌ సొమ్మే వారికి ఆసరా అవుతోంది. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రుల పోçషణాభారం భరించని ఉద్యోగుల వేతనాల నుంచి కట్‌ చేసి.. నేరుగా వారి ఖాతాలో జమ చేయాలని చట్టం చెబుతుంది. ఈ నేపథ్యంలో వృద్ధుల పింఛన్‌ కట్‌ అయిన పక్షంలో నెలవారీ కొంత మొత్తాన్ని ఉద్యోగులు తమ తల్లిదండ్రులకు ఇచ్చేలా చూడాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించింది. అదేవిధంగా ఇప్పటివరకు అక్రమంగా పొందిన పింఛన్‌ సొమ్మును ఆయా ఉద్యోగుల నుంచి రికవరీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు పొందుతున్న లబ్ధిదారుల జాబితాను స్వయంగా తనిఖీ చేసి నివేదికలు పంపాలని ఎంపీడీవోలు, పురపాలకసంఘాల కమిషనర్లను ఆదేశించింది. 

మరిన్ని వార్తలు