గ్రామీణ మహిళలకు సరికొత్త రుణం!

22 Mar, 2019 16:29 IST|Sakshi
సంఘం సభ్యులకు రుణాలపై అవగాహన కల్పిస్తున్నా ఏపీఎం(ఫైల్‌)

మహిళా సంఘాల సభ్యులందరికీ రుణం 

మంజూరులో కొత్త  విధానానికి శ్రీకారం    

సాక్షి, పాన్‌గల్‌: గ్రామీణ మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)అండగా నిలుస్తోంది. సంఘాల్లోని సభ్యులందరికీ తక్కువ వడ్డీరేటుకు రుణం అందిస్తోంది. సంఘాల ఆర్థిక స్వావలంభనకు కృషి చేస్తోంది. ఈ క్రమంలో మహిళా సంఘంలోని సభ్యులకు అందించే రుణ సదుపాయంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. సాధారణంగా పొదుపు సంఘంలో సుమారు 10మంది నుంచి 15మంది వరకు సభ్యులుగా ఉంటారు. వీందరికి తీసుకున్న రుణం, వారి చెల్లింపు ఆధారంగా నిధులను బ్యాంకర్లు మంజూరు చేస్తారు.

సంఘం సభ్యులు రుణం పొందినవారు కనీసం మూడేళ్లపాటు వాయిదాలు చెల్లిస్తుంటారు. చివరి వాయిదా చెల్లించే వరకు మరో రుణం అందదు. సంఘంలోని 15మందికి ఒకేసారి ఆర్థిక అవసరాలు వస్తే మరొకరి పేరిట రుణం తీసుకుని వాయిదాలు చెల్లిస్తుంటారు. సెర్ప్‌ లక్ష్యాలకు ఇది విరుద్ధం. వీటిని అరికట్టేందుకు కొత్త విధానాన్ని ప్రారంభించనుంది. ఇందుకు హౌస్‌ హోల్డ్‌ లైవ్లీ హుడ్‌ ప్లాన్‌(హెచ్‌ఎల్‌పీ) పేరిట పథకాన్ని రూపొందించింది. దీనిపై మహిళా సంఘాల సభ్యులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తోంది. 

మండలంలో 7219 మంది సభ్యులు 
మండలంలోని 28 పంచాయతీల పరిధిలోని గ్రా మాల్లో 631 మహిళా సంఘాలు ఉన్నాయి. ఆయా సంఘాల్లో మొత్తం 7219 మంది సభ్యులు ఉన్నా రు. ఆయా సంఘాలకు ఈ ఆర్థిక సంవత్సరం రుణ లక్ష్యం బ్యాంకుల ద్వారా రూ.8.20కోట్లకు ఇప్పటికీ రూ.5.68కోట్ల రుణాలు అందించారు. స్త్రీనిధి ద్వారా రూ.4.06కోట్ల లక్ష్యానికి ఇప్పటికి రూ.3.28కోట్ల రుణాలు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్త విధానం ద్వారా ప్రతి çసభ్యురాలికి రుణం అందనుంది. 

రుణ సదుపాయం ఇలా.
సంఘంలోని సభ్యులను రెండు లేదా మూడు, అంతకుమించి గ్రూపులుగా విభజిస్తారు. మొదటి సంవత్సరంలో మొదటి గ్రూప్‌ సభ్యులకు రూ.5లక్షల వరకు రుణం అందించి మిగతా వారికి రెండో ఏడాదిలో అప్పు సదుపాయం కల్పిస్తారు. మొదటి సంవత్సరం రుణం తీసుకున్న సభ్యులు వాయిదాలు చెల్లిస్తే మరుసటి సంవత్సరం అదే సంఘానికి పరిమితిని మించి లేదా పరిమితికి లోబడి రెండో గ్రూప్‌ సభ్యులకు రుణాలు ఇస్తారు. దీంతో ప్రతి సభ్యురాలికి రుణం అందుతుంది.

ప్రతి సంఘంలోని ప్రధాన బాధ్యులకు కొత్తరుణ విధానం గురించి అవగాహన కల్పిస్తారు. వీరు మిగతా మహిళలకు శిక్షణ ఇస్తారు. రుణం తీసుకోవడం, అవసరాలకు వినియోగించుకోవడం, తిరిగి చెల్లించడం వంటి అంశాలను వివరిస్తారు. సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారిలకు అవగాహన కల్పిస్తారు. దీంతో ప్రతి సభ్యురాలి ఆర్థిక అవసరాలు తీరనున్నాయి. 


  

మరిన్ని వార్తలు